Telugu Gateway
Politics

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విస్ట్ లే ట్విస్ట్ లు

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విస్ట్ లే ట్విస్ట్ లు
X

సుదీర్ఘ విరామం త‌ర్వాత జ‌రుగుతున్న కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గాంధీ కుటుంబం నుంచి ఎవ‌రూ ఈ సారి బాధ్య‌త‌లు తీసుకోవ‌టానికి ముందుకు రాక‌పోవ‌టంతో ఎన్నిక అనివార్యంగా మారింది. తొలుత అధిష్టానం అధికారిక అభ్య‌ర్ధిగా రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను బ‌రిలోకి దింపాల‌ని ప్ర‌తిపాదించారు. ఆయ‌న కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నందున యువ నేత స‌చిన్ పైల‌ట్ ను సీఎం చేయాలని భావించారు. కానీ గెహ్లాట్ వ‌ర్గం ఎమ్మెల్యేలు అంతా తిరుగుబాటు జెండా ఎగ‌రేయ‌టంతో...సీఎల్పీ స‌మావేశ‌మే జ‌ర‌ప‌లేక‌పోయారు. అధిష్టానానికి అత్యంత విశ్వాస‌పాత్రుడు అని పేరున్న అశోక్ గెహ్లాట్ వ్య‌వ‌హరించిన తీరుతో సోనియాగాంధీ కూడా షాక్ కు గుర‌య్యారు. ఇప్పుడే ఇలా చేస్తే రేపు అధ్య‌క్ష ప‌ద‌విలో వ‌చ్చాక ఎన్ని చికాకులు పెడ‌తారో అన్న భ‌యంతో ఆయ‌న్ను రేస్ నుంచి త‌ప్పించారు.

సోనియాగాంధీకి ఆయన క్షమాప‌ణ చెప్పినా కూడా ఒక‌సారి అప‌నమ్మ‌కం వ‌చ్చిన త‌ర్వాత అది అంత త్వ‌ర‌గా పోద‌నే విష‌యం తెలిసిందే. గెహ్లాట్ ప్లేస్ లో సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ తెర‌పైకి వ‌చ్చారు. ఆయ‌న పోటీ ఖ‌రారు అయిపోయింద‌ని అంద‌రూ భావిస్తున్న త‌రుణంలో మ‌రో ఝ‌ల‌క్. దిగ్విజ‌య్ సింగ్ స్థానంలో రాజ్య‌స‌భ‌లో పార్టీ నేత‌గా ఉన్న మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే చివ‌ర‌కు నామినేష‌న్ వేశారు. ఆయ‌న‌తోపాటు మ‌రో ఎంపీ శ‌శిధ‌రూర్ కూడా పోటీలో ఉన్నారు. అయితే అధిష్టానం మ‌ద్ద‌తు ఉన్న వ్య‌క్తి మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే. ఆయ‌న ఎస్సీ నేత కూడా కావ‌టం రాజ‌కీయంగా త‌మ‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, శశిధ‌రూర్ తోపాటు జార్ఖండ్ కు చెందిన మాజీ మంత్రి కె ఎన్ త్రిపాఠి కూడా బ‌రిలో ఉన్నారు. ఆయ‌న కూడా నామినేష‌న్ వేశారు.

Next Story
Share it