Telugu Gateway
Politics

తెలంగాణ‌పై ద్వేషం..అక్క‌సు

తెలంగాణ‌పై ద్వేషం..అక్క‌సు
X

రాష్ట్ర విభ‌జ‌న గురించి ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంట్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ విభజన పట్ల అక్కసు, ద్వేషం వెళ్లగక్క‌టం ఆయ‌న‌కు అల‌వాటే అన్నారు. హ‌రీష్ రావు మంగ‌ళ‌వారం నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పోతారం జే గ్రామంలో దళిత బందు అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. 2014 లో తెలంగాణ నే రాకపోతే ఈ అభివృద్ధి సాధ్యం అయ్యేనా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ వచ్చిందని మనం సంతోష పడితే ప్రధాని మోడీ ఎందుకో దుఃఖ పడుతున్నాడన్నారు. ఆంధ్ర తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట..మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారన్నారు. తెలంగాణ బాగుపడుతుంది... కానీ మోడీకి నచ్చడం లేదు.అభివృద్ధి లో గుజరాత్ ను దాటిపోతున్నము అని భయమా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్రజలు వేరుపడ్డము.. బాగు పడ్డము అన్నారు. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారు..నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా విభజన అని ఎలా అంటారు.. ఈ స్ఫూర్తితో ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికి రాత్రికి కలిపేశారు..కనీసం మాట చెప్పకుండా చేసి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు. తెలంగాణ ఏర్పడితే మీకు వచ్చిన బాధ ఏమిటి. పెప్పర్ స్ప్రే మధ్య బిల్లు పాస్ అయ్యిందట. ఎట్లా పాస్ అయితే ఏంటి..కాకినాడ తీర్మానం ప్రకారం మీరు ఆనాడే తెలంగాణ ఇస్తే అంత మంది బలిదానాలు జరిగేవా. కాంగ్రెస్ పార్టీ ఆ నాడు కామన్ మినిమము ప్రోగ్రాం లో పెట్టింది. 2004 లోనే తెలంగాణ ఇస్తే ఇంత మంది విద్యార్థులు అమరులు అయ్యేవారా.. శ్రీకాంత చారి అమరుడు అయ్యేవాడా. యువకుల బలిదానాలకు కారణం ఈ బిజెపి, కాంగ్రెస్ పార్టీ..వందల ప్రాణాలు పోడానికి కారణం మీరు. ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం, తెలంగాణ ఆలస్యం వల్ల యువకులు చనిపోయారు. మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా మోడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని తెలిపారు.

Next Story
Share it