మొన్న కెటీఆర్..ఇప్పుడు హరీష్ రావు

ఏపీ విద్యుత్ పరిస్థితిపై వ్యంగాస్త్రాలు
వేరు బడి తెలంగాణ ముందుకు..ఏపీ వెనక్కి
కొద్ది రోజుల క్రితం ఏపీలోని పరిస్థితులపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలోని రహదారులు..విద్యుత్ , నీటి సరఫరా దారుణంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం తనకు ఓ స్నేహితుడు చెప్పారన్నారు. దీనిపై రాజకీయ దుమారం రేగటంతో మంత్రి కెటీఆర్ రాత్రికిరాత్రే తాను అన్యాపదేశంగా ఈ వ్యాఖ్యలు చేశాను తప్ప..ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు అని వివరణ ఇచ్చారు. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అచ్చం అలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఈ మధ్య తిరుపతి కాలినడకన వెళ్లానని..కొండపైకి ఎక్కటానికి మూడు నుంచి మూడున్నర గంటల సమయం పట్టిందన్నారు.
నడిచే సమయంలో మద్రాస్ నుంచి వచ్చినవాళ్లు..రాయలసీమ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల నుంచి అందరూ వస్తారు కదా.. అందరితో మాట్లాడుకుంటూ వెళ్లా. వాళ్ళ దగ్గర విద్యుత్ ఎలా ఉంది..మంచినీళ్ళు..కరెంట్ ఎలా ఉంది అని అడుగుతూ పోయా.ఒక్కడు కూడా మన మోకాళ్ల దగ్గరకు కూడా రాడు. ఏపీలో కరెంట్ ఎలా ఉంది అంటే రైతులకు ఆరేడు గంటలు కూడా విద్యుత్ రావటం లేదు. ఎప్పుడు వచ్చేది..ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. ఏపీ వాళ్ళు మాట్లాడుతూ మీరు వేరుబడ్డరు..తెలంగాణలో మాత్రం మంచిగ అయిపోయారు.మేం మాత్రం వెనకకు బట్టినం అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు..నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.