ఆశించినట్లు ఫలితాలు రాలేదు. కెటీఆర్
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ స్పందించారు. పలితాలు తాము ఆశించినట్లు రాలేదన్నారు. అయినా కూడా మరింత అప్రమత్తం కావటానికి ఈ ఫలితం ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. తాము గతంలో చెప్పినట్లు విజయాలకు పొంగిపోం..ఓడితే కుంగిపోం అన్నారు. ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదనే అంశంపై త్వరలోనే సమీక్షించుకుంటామని అన్నారు. కెటీఆర్ మంగళవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అందరం కూర్చుని సమీక్ష జరిపి..ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చాయో అర్ధం చేసుకుంటామన్నారు.
అయితే ప్రభుత్వరంగా తాము చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు యతాతథంగా ముందుకు సాగుతుతాయని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ముందుకెళతామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వేసిన 62 వేల పైచిలుకు మందికి ధన్యవాదాలు తెలిపారు కెటీఆర్. పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, మంత్రి హరీష్ రావుకు కూడా కెటీఆర్ దన్యవాదాలు తెలిపారు. దుబ్బాక ఫలితంపై తాను చెప్పాలనుకున్నది చెప్పేసి మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు తీసుకోకుండా ప్రెస్ మీట్ ను ముగించారు.