Telugu Gateway
Politics

గ‌వ‌ర్న‌ర్ ది పొలిటిక‌ల్ ద‌ర్బారే

గ‌వ‌ర్న‌ర్ ది పొలిటిక‌ల్ ద‌ర్బారే
X

అధికార టీఆర్ఎస్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై శుక్ర‌వారం నాడు నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్ పై మండిప‌డింది. ఇది ప్ర‌జా ద‌ర్బార్ కాదు..పొలిటిక‌ల్ ద‌ర్బార్ అని ఆరోపించింది. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాదరణ భారీ గా పెరుగుతోంద‌ని...విపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యానించారు. మనం అనుసరించే వైఖరితోనే మనకు గౌరవం దక్కుతుంద‌ని, సీఎం కేసీఆర్ కు రాజ్యాంగ వ్యవస్థల మీద అపార గౌరవం ఉందన్నారు. వివేకానంద శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుప‌ట్టారు. బీజేపీ గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోంద‌ని ఆరోపించారు. గవర్నర్ ప్రజా దర్బార్ కు తాము జవాబు దారి కాదు.ఓట్లేసిన ప్రజలకే మేము జవాబు దారీ అన్నారు. గుజరాత్ లో మోడీ సీఎం గా ఉన్నపుడు అక్కడ గవర్నర్ కమల బేనివాల్ ప్రజా దర్బార్ పెడితే ఆమె ను తొలగించాలని అప్ప‌టి పీఎం మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు చేయడం నిజం కాదా అని ప్ర‌శ్నించారు.

యూపీ లో 2014 లో బీజేపీ ప్రతిపక్షం లో ఉన్నా అప్పటి గవర్నర్ అజీజ్ ఖురేషి రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింద‌ని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ప్రతిపక్షం లో ఉండగా గవర్నర్ లను నియమించే పద్దతి పై నీతులు బోధించారు. ప్రధాని మోడీ సీఎం గా ఉన్నపుడు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళను గవర్నర్ లు గా నియమించాలని డిమాండ్ చేశారు.ఇపుడు మాత్రం మోడీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. తాము ఇప్పటి వరకు గవర్నర్ ను తొలగించాలని డిమాండ్ చేయలేదని, గవర్నర్ లక్ష్మణ రేఖ దాటొద్ద‌న్నారు. మా హ‌క్కులను కేంద్రం కాల రాస్తోంది..గ‌వ‌ర్నర్ తన గౌరవాన్ని తాను కాపాడుకోలేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీ కి చిత్త శుద్ధి ఉంటే...అన్ని రాష్ట్రాల గవర్నర్ లు ప్రజా దర్బార్ లు నిర్వహించాలే చూడాల‌న్నారు.

Next Story
Share it