ప్రధాని మోడీపై టీఆర్ఎస్ ప్రివిలైజ్ నోటీసు
ప్రధాని మోడీపై టీఆర్ఎస్ ప్రివిలైజ్ నోటీసుప్రధాని నరేంద్రమోడీ తెలంగాణను అవమానించారంటూ ఆయనపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు. ఏపీ విభజన సందర్భంగా పార్లమెంట్ లో జరిగిన కార్యకలాపాలపై ఇటీవల మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. పెప్పర్ స్ప్రే వాడారని..ఎలాంటి చర్చ లేకుండానే విభజన బిల్లును పాస్ చేశారని కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.ఈ వ్యాఖ్యలపై అదికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్, గురువారం నాడు రాజ్యసభలో ఇదే అంశంపై ప్రివిలైజ్ నోటీసు ఇచ్చింది.
రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు, ఎంపీలు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, లింగయ్యయాదవ్ లు నోటీసు ఇచ్చారు. 187వ నిబంధన ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాని రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించటమే అని టీఆర్ఎస్ చెబుతోంది. ప్రధాని మోడీపై నోటీసు ఇవ్వటంతోపాటు రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.