Top
Telugu Gateway

అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు

అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు
X

మాఫియా పెంచి పోషించింది బిజెపినే

బండి సంజయ్ పై ఫైర్

ప్రగతి భవన్ రాష్ట్రంలోని అన్ని మాఫియాలకు కేంద్రంగా మారిందని అంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో మాఫియాను పెంచి పోషించేది బీజేపీ అని, హత్యలు అత్యాచారాలు చేసిన 25 మంది మంత్రివర్గాల్లో ఉన్నారని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసులు ఉన్న నేతలు 176 మంది పాలకవర్గంలో కొనసాగుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసుల వల్ల గతంలో గుజరాత్ నుంచి వెలివేశారని గుర్తుచేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. నల్లధనం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని, పేదలకు ఎంతధనం పంచారో చెప్పాలి? అని ప్రశ్నించారు.

దేశం బయట ఉన్న డబ్బులు దేశానికి రప్పించకుండా.. దేశంలో ఉన్న డబ్బులు బయటకు తరలిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్ కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను అన్నట్లేనన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందని హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కరోనాను కనిపెట్టడంలో విఫలమవగా ఆ సమయంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత ధీటుగా ఎదుర్కొందో దేశమంతా చూసిందని గుర్తుచేశారు.

జనాల మైండ్‌తో గేమ్ ఆడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రామ మందిరం కట్టడమే ఇష్టం లేదని.. సుప్రీంకోర్టు చెప్పేవరకు పోరాటం చేసిన నేత ఒక్కరూ బీజేపీలో లేరని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ డెవలమెంట్ పెట్టి దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తెలంగాణలో 7లక్షల 60 వేల ఉద్యోగాలు ఐటీ ఆధారితతో యువతకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను రూ.10 కోట్లు పెట్టి బయట కొన్నా ఉపయోగం లేదని చెప్పారు. కొన్ని పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలారు అని తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి విరుచుకుపడ్డారు.

Next Story
Share it