Telugu Gateway
Politics

రేవంత్ వ్యాఖ్య‌ల‌పై గ‌రం గ‌రం

రేవంత్ వ్యాఖ్య‌ల‌పై గ‌రం గ‌రం
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాజ‌కీయాల్లో కాక పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి త‌ర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టాలంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ లో గెలిచి త‌ర్వాత అధికార టీఆర్ఎస్ లో విలీనం అయిన నేత‌లు మండిప‌డుతున్నారు. ఈ మేర‌కు కొంత మంది మీడియాతో మాట్లాడ‌గా..ఆ త‌ర్వాత ఈ పార్టీ మారిన వారి అంద‌రి పేర్ల‌తో ఓ ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. అంద‌రూ మూకుమ్మ‌డిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ''రేవంత్‌రెడ్డి.. పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నాడు. మీరు రాళ్లతో కొడితే మేం చెప్పులతో కొడతాం' అంటూ ఆయన ధ్వజమెత్తారు. తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం అయ్యామ‌న్నారు. మావి సేవా రాజకీయాలు, నీది స్వార్థ రాజకీయాలు అంటూ రేవంత్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. పీసీసీ రాకుంటే రేవంత్ రెడ్డి పార్టీ మారే వాడ‌ని ఆరోపించారు.

మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ్ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. మ‌రో నేత గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల మొత్తం వివాదాస్పదమేనని, రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 'కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీ లు మారితే సంసారం, కానీ ఇక్కడ మారితే వ్యభిచారమా' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్‌లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు. రేవంత్ గ‌త చ‌రిత్ర అంద‌రికీ తెలుస‌ని ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లో ఎమ్మెల్యేలు ధ్వ‌జ‌మెత్తారు. అన్నీ త‌న‌కే తెలుస‌న్న‌ట్లు పిట్ట‌ల దొర మాట‌లు మాట్లాడున్నార‌న్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికైనా బుద్ధి మార్చుకుని తెలంగాణ సోయి తెచ్చుకోవాల‌న్నారు.

Next Story
Share it