ఈటెల కమ్యూనిజాన్ని బిజెపికి తాకట్టుపెట్టారా?
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు ఢిల్లీలో బిజెపి ప్రెసిడెంట్ జె పి నడ్డాతో సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ ఆయనపై విమర్శల దాడి పెంచింది. ఇంత వరకూ అక్రమాలు,,భూ కబ్జాల వంటి అంశాలనే ప్రస్తావించిన నేతలు ఇప్పుడు కొత్త కొత్త అంశాలను కూడా తెరపైకి తెస్తున్నారు. ఈటెల నీ కమ్యూనిజం ఇప్పుడు ఎక్కడ పోయింది.. బీజేపీ నేతల దగ్గర తాకట్టు పెట్టావా అంటూ రాజేందర్‌ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈటెలపై విమర్శలు గుప్పించారు.
' ఇవాళ ఈటెలను అందరూ ఛీ కొడుతున్నారు. ఒక మంత్రిగా ఈటల చట్ట విరుద్ధమైన పనులు చేశారు? అసైన్ మెంట్ భూములు ఎలా తీసుకున్నావు? నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది?.. 20 ఏళ్లల్లో సీఎం కేసీఆర్ ఎందరో నేతలను తయారు చేశారు. కానీ నిన్ను గౌరవించినట్లు కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. నాయకుడు, పార్టీపై నమ్మకం లేకుంటే చెప్పాలి. ఈటెల క్షమించరాని నేరం చేశారు. సమయం చూసి ఆయనపై పార్టీ పరంగా కెసీఆర్ చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. మంత్రిగా ఉంటూ కూడా ప్రభుత్వ పథకాలపై ఆయన విమర్శలు చేశారన్నారు.