Telugu Gateway
Politics

మళ్ళీ మొదటికొచ్చిన తెలంగాణ పీసీసీ కథ

మళ్ళీ మొదటికొచ్చిన తెలంగాణ పీసీసీ కథ
X

సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత కూడా తెలంగాణ పీసీసీ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఓ వైపు తెలంగాణలో బిజెపి దూకుడు చూపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నాన్చుడు ధోరణితో వెళుతోంది. కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ను నియమించటానికి పార్టీ నానా కష్టాలు పడుతుంటే ప్రజలు ఆ పార్టీపై విశ్వాసం చూపించగలరా? అన్న ప్రశ్నలు ఉదయించటం సహజం. పీసీసీ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. సాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసే వరకూ ప్రస్తుత పీసీసీ కొనసాగుతారని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు కొనసాగనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీని నియమించాలని కోరారని..ఆయన వినతిని మన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి ఆయన కీలక నేత అని..అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉప ఎన్నిక తర్వాత పీసీసీతోపాటు ప్రచార కమిటీ, అన్ని కమిటీలను ఒకేసారి వెల్లడిస్తామని ఠాకూర్ తెలిపారు.

Next Story
Share it