Telugu Gateway
Politics

ఇది హుషార్ హైద‌రాబాద్ ..కెటీఆర్

ఇది హుషార్ హైద‌రాబాద్ ..కెటీఆర్
X

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కెటీఆర్ శ‌నివారం నాడు రోడ్ షోల‌కు శ్రీకారం చుట్టారు. న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. కెటీఆర్ ప్రధాన టార్గెట్ అంతా బిజెపిపైనే సాగింది. దీంతో ఈ ఎన్నిక‌లు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. ''ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. చలాన్లు కొట్టొద్దు.. బండిపై నలుగురు ఎక్కొచ్చని ఒకాయ అంటున్నాడు. తాగి బండి నడపవచ్చంట. బండి పోతే బండి ఫ్రీ. కారుపోతే కారు ఫ్రీ. ఇల్లు పోతే ఇల్లుఫ్రీ. 25వేలు ఇస్తానని ఆయన అంటున్నాడు. వరదసాయం రూ.10వేలు ఇస్తుంటే మీరే ఆపారు. అలాంటిది రూ.25 వేలు ఇస్తారా? అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడా? వరదల సమయంలో మేమంతా మీవెంటే ఉన్నాం. రూ.650 కోట్లు మంజూరు చేశాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఇస్తాం. బీజేపీ నేతల కథలు వినేందుకు.. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. ఉషార్.. హైదరాబాద్. మీ డ్రామాలు నడవవు. మీరు ఆగమాగం చేస్తే ఎవరూ కారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో మేం ఎన్నో చేశాం. వంద పనులు.. గంటల తరబడి చెబుతాం.

ఆరేళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసింది? కిషన్ రెడ్డికి దమ్ముంటే ఒక్కటంటే ఒక్క పని చూపించండి.'' అని మంత్రి కేటీఆర్ అన్నారు.మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లిలోని ఓల్డ్ అల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ వచ్చిందని విరుచుకుపడ్డారు. హిందూ-ముస్లిం మధ్య చిచ్చు పెట్టి ఓట్ల సాధించాలని భావిస్తోందని మండిపడ్డారు. ఈ నగరం ప్రశాంతంగా ఉందనే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని..ఇప్పుడా వాతావరణాన్ని బీజేపీ నేతలు చెడగొడుతున్నారని ధ్వజమెత్తారు. గ‌త ఆరే్‌ళ్ళ కాలంలో న‌గ‌రానికి ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు వ‌చ్చాయ‌న్నారు. యువ‌త‌కు ఉపాధి ద‌క్కాలంటే ఇలాంటి సంస్థ‌ల అవ‌స‌రం ఎంతో ఉంద‌న్నారు.




Next Story
Share it