ఇవే నా చివరి ఎన్నికలు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడవ దశ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన ఇవే తనకు చివరి ఎన్నికలు అని..తనకు విజయమాల అందిస్తారా? లేదా అని సభికులను ప్రశ్నించారు. వారి నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వ్యక్తం అయింది. ఈ ఎన్నికల్లోనే నితీష్ కుమార్ కు గడ్డు పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. బీహర్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నవంబర్ 10న వెల్లడి కానున్నాయి.
చివరి దశ పోలింగ్ 7న జరగనుంది. చివరి దశ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ రాజేసేందుకే ఆయన ఈ ప్రకటన చేసినట్లు ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ' బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా..' అంటూ బహిరంగసభలో పేర్కొన్నారు.