Telugu Gateway
Politics

అప్పుడు అన్న‌..ఇప్పుడు చెల్లి

అప్పుడు అన్న‌..ఇప్పుడు చెల్లి
X

సేమ్ టూ సేమ్. అప్పుడు అన్న కెటీఆర్..ఇప్పుడు చెల్లి క‌విత‌. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే కోర్టుల‌ను ఆశ్ర‌యించి ఇంజెక్షన్ ఆర్డ‌ర్లు తెచ్చుకున్నారు. త‌మ‌పై ఎవ‌రూ మాట్లాడ‌కుండా చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో మంత్రి కెటీఆర్ కూడా త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌కుండా ఆదేశించాలంటూ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డ‌ర్ తెచ్చుకున్నారు. దీంతో రేవంత్ ఈ అంశంపై మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. తాజాగా ఢిల్లీకి చెందిన బిజెపి ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సిర్సాలు సీఎం కెసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత‌పై తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు.

దీంతో ఆమె నాంప‌ల్లిలోని సిటీ సివిల్ కోర్టులో ఇంజెక్షన్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త‌న‌పై ఆరోపణ‌లు చేశార‌ని..త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించారంటూ ఆమె కోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిపై ప‌రువు న‌ష్టం దావా కూడా వేశారు. దీంతో సిటీ సీవిల్ కోర్టు మ‌ధ్యంత‌ర ఆదేశాలు జారీ చేస్తూ క‌విత ప‌రువుకు న‌ష్టం చేకూర్చేలా ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌వ‌ద్ద‌ని..బిజెపి ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సిర్సాల‌ను ఆదేశించింది. మీడియా స‌మావేశాలు..సోష‌ల్ మీడియా, స‌భ‌ల్లో కూడా ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌వ‌ద్ద‌ని కోర్టు ఆదేశించింది. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రికీ నోటీసులు కూడా జారీ చేసి..త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 13కు వాయిదా వేసింది.

Next Story
Share it