Telugu Gateway
Politics

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ చ‌లో రాజ్ భ‌వ‌న్

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ చ‌లో రాజ్ భ‌వ‌న్
X

కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో రాజ్ భ‌వ‌న్ ఉద్రిక్తంగా మారింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద‌కు ర్యాలీగా బ‌య‌లుదేర‌గా..పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ స‌మయంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు..పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పెట్రో ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ పార్టీ చ‌లో రాజ్ భ‌వ‌న్ త‌ల‌పెట్టిన విష‌యం తెలిసింది. గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేర‌ని..ఆన్ లైన్ లో విన‌తిప‌త్రం పంపాల‌ని పోలీసులు సూచించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ర‌కూ అయినా అనుమ‌తి రేవంత్ రెడ్డ కో ర‌గా..ఇందుకూ అనుమ‌తి నిరాక‌రించారు. ఆ వెంట‌నే పోలీసులు రేవంత్ రెడ్డి, మ‌ధు యాష్కీ త‌దిత‌రుల‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వహ‌రించాలి కానీ...అధికార పార్టీ చెప్పిన‌ట్లు కాద‌న్నారు. అంతకు ముందు రేవంత్ ప‌లుమార్లు మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ఖాసిం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ సూచనతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ కార్యర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిని ఎక్కడ దాచిపెట్టారో తెలియడంలేదని, సాయంత్రం ఐదు గంటల తర్వాత విడిచిపెడతామని చెబుతున్నారని మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని, ఈ రకమైన అరెస్టులు చేసి పోలీసులతో పరిపాలన చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటే తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. అధికారులు ముఖ్యమంత్రి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసమని చెప్పారు. 40 రూపాయల పెట్రోల్‌కు 65 రూపాయల పన్ను వసూలు చేస్తున్నారని, అలాగే డీజీల్, గ్యాస్పై అధిక ధరలు వసూలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అబ‌ద్దాల‌తోనే సీఎం కెసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యార‌ని ఎద్దేవా చేశారు . పెట్రో ప‌న్నుల‌తో మోడీ, కెసీఆర్ ప్ర‌జ‌లను దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

Next Story
Share it