Telugu Gateway
Politics

కఠిన నిర్ణయమే..అయినా తప్పట్లేదు

కఠిన నిర్ణయమే..అయినా తప్పట్లేదు
X

ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం...చంద్రబాబు

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నకలను బహిష్కరించనున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతకు ముందు ఆయన పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయన్నారు. ఈ ఎన్నికల విషయంలో కొత్త ఎస్ఈసీ రబ్బర్ స్టాంప్ గా మారారని ఆరోపించారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చిరాగానే నిర్ణయం తీసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని నిలదీశారు. స్థానిక ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగటంలేదని తప్పుబట్టారు. ఎన్నికలకు ముందే సీఎం, మంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు జరుపుతున్నారని విమర్శించారు.

తాజా పరిస్థితుల కారణంగా కఠిన నిర్ణయాలు తప్పట్లేదని చెప్పారు. పోటీ చేస్తామంటే బెదిరిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని బెదిరించి ఓట్లేయించుకున్నారని, ప్రశ్నిస్తే ఎర్రచందనం ఇళ్లలో పెట్టి కేసులు పెడుతున్నారని అన్నారు. బలవంతంగా నామినేషన్లు విత్‌ డ్రా చేయించారని చంద్రబాబు ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీల ఏకగ్రీవాలు కేవలం 2 శాతం ఉంటే..ఇప్పుడు అవి 24 శాతానికి పెరిగాయన్నారు. జడ్పీటీసీలు కూడా ఒక శాతం నుంచి 19 శాతానికి పెరిగాయన్నారు. అధికార వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు సాధ్యం అయ్యాయన్నారు.

అప్రజస్వామిక పద్దతుల్లో జరిగే ఎన్నికల్లో భాగస్వాములు కాలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్ఈసీ తీరుకు నిరసనగా తమ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తుందని తెలిపారు. తెలుగుదేశం నిర్ణయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వైసీపీ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాడతామని తెలిపారు. అదే సమయంలో చంద్రబాబు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన కుమార్తె సునీత లేవనెత్తిన ప్రశ్నలను కూడా చంద్రబాబు లేవనెత్తారు. ఆమె ప్రశ్నలకు సీఎంజగన్, డీజీపీ గౌతం సవాంగ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Next Story
Share it