Telugu Gateway
Politics

తెలంగాణ తెచ్చుకుంది రాజన్న బిడ్డ ఏలటానికి కాదు

తెలంగాణ తెచ్చుకుంది రాజన్న బిడ్డ ఏలటానికి కాదు
X

కెసీఆర్ వదిలిన బాణమే షర్మిల

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె తెలంగాణ సీఎం కెసీఆర్ వదిలిన బాణమే అని వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ ఏర్పాట్లపై రేవంత్ స్పందన ఇది...'వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు.ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారు. వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగా చేశారు .వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉంది. అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరు. తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ... రాజన్న బిడ్డగా ఏలుకోవడానికి కాదు. రాజన్న బిడ్డగా సారె పెట్టి పంపుతా కానీ, పార్టీ పెడితే ప్రజలు ఆమోదించరు.షర్మిలకు తన అన్నతో పంచాయితీ ఉంటే అక్కడ చూసుకోవాలి. కేసీఆర్ ఇక సీఎం అయ్యేది లేదు. కేసీఆర్ దోపిడీ చూసి వంద మీటర్ల గోతిలో పాతి పెట్టడానికి ప్రజలు రెడీ అయ్యారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిల. పులిచింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలి. తెలంగాణ ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డి పాడు, సంగమేశ్వరం పై కోర్టులో కేసు వేసి రావాలి.

తెలంగాణ వద్దు... సమైక్యరాష్ట్రం ముద్దు అన్నారు కదా... చనిపోయిన బిడ్డలకు ముందు క్షమాపణ చెప్పండి .వైఎస్ బిడ్డగా ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం కానీ, రాజ్యాలు ఏలుతానికి వస్తామంటే కుదరదు .నీ అన్నని కాదని మా తెలంగాణ పక్షాన నువ్వు నిలబడే చిత్తశుద్ధి ఉందా?. ఉంటే కృష్ణా జలాలపై జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ కేసులు వేసి రావాలి . మీరు పార్టీ పెడితే తెలంగాణ బిడ్డలు ఊరుకోరు.తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలను అవమానించకండి. తెలంగాణలో వైఎస్ అభిమానులు స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. మన రాష్ట్రం మనం ఏలాలా... పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏలాలా?. షర్మిల పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదు. 1200 మంది బిడ్డల బలిదానాలను అవమానించే వాడే షర్మిలకు స్వాగతం పలుకుతాడు. కేసీఆర్ ఎందుకు ఫాంహౌస్ లో పడుకున్నాడు... షర్మిల పార్టీపై ఎందుకు నోరు మెదపడం లేదు. కెసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చేందుకు పార్టీ పెట్టిస్తారా.కేసీఆర్ కుట్ర నుంచి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలి ' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it