నవంబర్ 2 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తనవైపే ఉన్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. నవంబర్ 2న ఫలితాలు వెల్లడైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం అక్రమ సొమ్ము 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఛీ అనేలా వ్యవహరించారని ఆరోపించారు. కెసీఆర్ వ్యవహరించిన తీరు చూసి అందరూ నివ్వెరపోయారన్నారు. నిరంకుశత్వాన్ని బొంద పెట్టడానికి హుజూరాబాద్ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
వందల మంది పోలీసులను ఈ ఎన్నిక కోసం వాడుకున్నారన్నారని, . కొన్ని వేల కుటుంబాలు ఓటుకు ఆరు వేల రూపాయలు త్యాగం చేసి మరీ తన వెంట వచ్చారన్నారు. దళితబంధు కింద పది లక్షల రూపాయలు పోతాయని తెలిసినా తన వెంట నడిచారన్నారు. అనేక ఉప ఎన్నికల్లో గెలిచినట్లే ఇక్కడ కూడా డబ్బుతో..ఇతర ప్రలోభాలు, వాగ్దానాలతో గెలవొచ్చని భావించారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఆ చరిత్రను తిరగరాశారు. హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా గడ్డ అన్యాయాన్ని, ఆదిపత్యాన్ని సహించదు. కెసీఆర్ కుట్రను, అన్యాయాన్ని ఆర్ధం చేసుకున్నది హుజూరాబాద్ ప్రజలు అని వ్యాఖ్యానించారు. ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలు తన వెంట ఉన్నారన్నారు.