Telugu Gateway
Politics

కెసీఆర్ ఢిల్లీ వెళ్ళింది విందుల కోస‌మా?

కెసీఆర్ ఢిల్లీ వెళ్ళింది విందుల కోస‌మా?
X

కాంగ్రెస్ లో అంద‌రూ పీసీసీ అధ్యక్షులే ..కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ వ‌రి దీక్ష ముగిసింది. రాష్ట్రంలో రైతుల దగ్గ‌ర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో రెండు రోజులుగా ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష సాగిన విష‌యం తెలిసిందే. ఆదివారం సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జానారెడ్డి నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష విర‌మింప‌చేశారు. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ , బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెర లేపాయ‌ని మండిప‌డ్డారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాన‌ని ఢిల్లీ కెళ్లిన కేసీఆర్..సురేష్‌రెడ్డి ఇంట్లో విందుభోజనం చేసి వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీని కలవలేదని, అపాయింట్‌మెంట్ అడగలేదని ఆరోపించారు. వరి మీద అవగాహన లేని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీని కేంద్రమంత్రి దగ్గరకు పంపితే ఏం మాట్లాడతారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నేతలు రైతులను ఆదుకోకుండా.. ఫిరాయింపులపై ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గుండు, అరగుండు వెళ్లి కేంద్రాన్ని అడగరని ఎద్దేవాచేశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన బీజేపీ నేత బండి సంజయ్ వరి మాటలు పక్కన పెట్టి.. విద్య, వైద్యంపై సంతకం అని కొత్త రాగం ఎత్తారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలో పోరాటం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

కెసీఆర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే వేల ట‌న్నుల ధాన్యం నీళ్ల పాలు అయింద‌ని విమ‌ర్శించారు. త‌న త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే కెసీఆర్ ధ‌ర్నాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. జానారెడ్డి మాట్లాడుతూ రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం లో ప్ర‌ధాని మోడీ, సీఎం కెసీఆర్ లు విఫ‌లం అయ్యార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ ఐక‌మ‌త్యంతో ముందుకు సాగాల‌ని జానారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన దీక్షకు మ‌ద్ద‌తు ఇచ్చిన రైతు సంఘాలు, ప్ర‌జా సంఘాల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ లో అంద‌రూ పీసీసీ ప్రెసిడెంట్ లే అన్నారు. ఏమైనా చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్నా క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌కు ప‌ద‌వులు ముఖ్యంకాద‌న్నారు.గ‌తంలో టిక్కెట్ల విష‌యంలో కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని వ్యాఖ్యానించారు. వ‌రి వేస్తే ఉరే అన్న ప్ర‌భుత్వానికే ఉరి వేయాల‌ని పిలుపునిచ్చారు. కెసీఆర్ సంపాద‌న నిజాం కంటే ఎక్కువైంద‌ని ఆరోపించారు. వెయ్యి మందితో ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష చేస్తామ‌ని దీనికి రాహుల్, ప్రియాంక‌ల‌ను కూడా ఆహ్వానిస్తామ‌ని తెలిపారు.

Next Story
Share it