కెసీఆర్ పై బొమ్మపైనే ఈటెల గెలిచారు
ఈటెల తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారు
తెలంగాణ మంత్రుల ఎటాక్
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలకు అధికార టీఆర్ఎస్ స్పందించింది. రాష్ట్ర మంత్రులు ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈటెలకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత దక్కిందని అన్నారు. ఎల్పీ లీడర్ గా కూడా ఆయనకు అవకాశం వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తాను లేకుంటే పార్టీలో ఏమీలేదన్నట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ రోజు పదవుల్లో ఉన్న వాళ్లలో చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నవారే అని తెలిపారు. ఈటెలకు ప్రభుత్వంలో పౌరసరఫరాలు, ఆర్ధిక, వైద్య శాఖ వంటి కీలక శాఖలు అప్పగించారన్నారు. గౌరవం దక్కలేదని ఈటెల వ్యాఖ్యానించటం సరికాదన్నారు. ఈటెలకు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నది అని ప్రశ్నించారు. సందర్భం వచ్చినప్పుడు అల్లా ముఖ్యమంత్రి కెసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని..చివరకు సంక్షేమ పథకాలపై కూడా విమర్శలు చేయటం దారుణం అన్నారు. మంత్రిగా పనిచేసిన ఆయనకు అసైన్ మెంట్ భూములు కొనుగోలు చేయకూడదని తెలియదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అసైన్ మెంట్ భూములు సేకరిస్తే అది ప్రజావసరాల కోసం అని..నీలాగా సొంత కంపెనీ..సొంత వ్యాపారాలు పెంచుకునేందుకు కాదని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు.
మీ వ్యాపార అభివృద్ధి తప్ప..దళితుల సంక్షేమం పట్టదా? అని ప్రశ్నించారు. తనకేదో అన్యాయం జరిగినట్లు ముఖ్యమంత్రి, పార్టీపై దాడి చేయటం సరికాదన్నారు. మంచిగా ఉన్న పార్టీని డిస్ట్రర్భ్ చేయటమే మీ ఉద్దేశం..సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవటమే మీ లక్ష్యమా అని ప్రశ్నించారు.ఆరేళ్లలో అరవై సంవత్సరాల అభివృద్ధి చేసి ఛూపించారని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. మీకు మీరే అతిగా ఊహించుకుని ఏదేదో మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ను దొర అని ఈటెల విమర్శిస్తున్నారు అని...బీసీ ముసుగులో ఉన్న దొర ఈటెల అని మరో మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. అనేక రకాలుగా పార్టీ నుంచి లబ్ది పొంది..ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయటం సరికాదన్నారు. ఈటెల మేకవన్నె పులి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీ గెలిస్తే సంతోషిస్తారు కానీ..ఈటెల మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఈటెల అంత అంబానీ కూడా సంపాదించలేదన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాము అయి చేరారు ఈటెల. అసెంబ్లీలో ఎప్పుడైనా ముదిరాజ్ ల కోసం ఈటెల రాజేందర్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఏ బీసీని ఎదగకుండా అడ్డుకున్నారు. కెసీఆర్ ఒక వ్యవస్థ..ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. వ్యక్తులు వస్తారు..పోతారు పార్టీనే శాశ్వతం అని వ్యాఖ్యానించారు.