Telugu Gateway
Politics

న‌డ్డాకు తెలంగాణ స‌ర్కారు స‌రెండ‌ర్?!

న‌డ్డాకు తెలంగాణ స‌ర్కారు స‌రెండ‌ర్?!
X

తెలంగాణ స‌ర్కారు బిజెపి జాతీయ ప్రెసిడెంట్ జె పి న‌డ్డాకు స‌రెండ‌ర్ అయిందా?. ప్ర‌భుత్వ నిర్ణ‌యం చూస్తే ఎవ‌రికైనా ఇదే అనుమానం రాక‌మాన‌దు. క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ర్యాలీలు. బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌జ‌లు గుమిగూడ‌టాన్ని నిషేదిస్తూ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. వాస్త‌వానికి జె పీ న‌డ్డా హైద‌రాబాద్ వ‌చ్చే వ‌ర‌కూ ర్యాలీకి అనుమ‌తి లేదని..జెపీ న‌డ్డాను అడ్డుకుంటామ‌ని చెబుతూ వ‌చ్చారు. విమానాశ్ర‌యంలో న‌డ్డాను క‌ల‌సిన జాయింట్ సీపీ కార్తికేయ ఆయ‌న్ను క‌ల‌సి క‌రోనా నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని వివ‌రించార‌న్నారు. అయితే త‌న ప్ర‌జాస్వామ్య హ‌క్కును ఎవ‌రూ హరించ‌లేర‌ని..కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ తాము కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని జె పీ న‌డ్డా విమానాశ్ర‌యంలో మీడియా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అస‌లు జీవోలోనే స్ప‌ష్టంగా ర్యాలీలు, ప్ర‌జ‌లు గుమిగూడే ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి లేదు అని ప్ర‌క‌టించిన త‌ర్వాత అస‌లు నిబంధ‌న‌లు పాటించ‌టం..పాటించ‌క‌పోవ‌టం అన్న స‌మ‌స్య ఎక్క‌డ నుంచి వ‌స్తుంది. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ దీక్షను అడ్డుకున్న‌ది కూడా కోవిడ్ నిబంద‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో క‌దా?.. అస‌లు ఏక‌మొత్తంగా బ‌హిరంగ కార్య‌క్ర‌మాల‌పై నిషేధం విదించాక ఇక కోవిడ్ నిబంద‌న‌లు పాటించ‌టం అన్న అంశ‌మే తెర‌పైకి రాదు.

కానీ తెలంగాణ స‌ర్కారు ఆయ‌న‌కు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అనే కార‌ణంతో అనుమ‌తి ఇచ్చింది. అధికారికంగా అనుమ‌తి ప‌త్రాలు లేక‌పోయినా ర్యాలీని అడ్డుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఈ లెక్క‌న స‌ర్కారు స‌రెండర్ అవ‌టం అయినా కార‌ణం అయి ఉండాలి..లేదంటే అంత‌ర్గ‌త అవ‌గాహ‌న మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుని ఉండాలి. అందులో బిజెపి జాతీయ ప్రెసిడెంట్ నిర్వ‌హించే ర్యాలీ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్షణ కోసం ఈ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు. అంటే బిజెపి తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం లేద‌ని చెబుతూ ర్యాలీ తీసుకునేందుకు స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది అంటే ప‌రిస్థితిని అర్ధం చేసుకోవ‌చ్చు. ఏది ఏమైనా నిషేధం ఉత్త‌ర్వులు ఉన్నా కూడా జె పీ న‌డ్డా కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌టం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌కు ఇది బ‌లం చేకూర్చేదిలా ఉంది. అయితే జె పీ న‌డ్డా ర్యాలీని అడ్డుకుంటే ఇది జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు కార‌ణం అవుతుంద‌నే కార‌ణం లేక‌పోలేద‌నే వాద‌న‌లూ విన్పిస్తున్నాయి. ఏది ఏమైనా రూల్ ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌కంగా ఉంటుంది..అది అధికారంలో ఉన్న వారికి అయితే అన్న విష‌యాన్ని తెలంగాణ స‌ర్కారు మ‌రో సారి రుజువు చేసింది.


Next Story
Share it