మరి కెసిఆర్ కు ఇప్పుడు ఎలా!
భవిష్యత్ లో దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలే అంటూ కెసిఆర్ బుధవారం నాడు ఎన్నికల ప్రచార సభల్లో వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. కొద్ది నెలల క్రితం ఇదే కెసిఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది...ఇక బంగారు భారత్ దిశగా అడుగులు వేస్తాం అని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ లకు అసలు పాలన చేతకాలేదు...దేశంలో సమస్యలు అన్నిటికి ఈ రెండు పార్టీలే కారణం అని చెప్పుకొచ్చారు. వీటి అన్నిటికి పరిష్కారం బిఆర్ఎస్ ఒక్కటే అని..తమకు అధికారం వస్తే భారత్ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నఅమెరికా, చైనా లను దాటిస్తాం అంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను జాతీయ పార్టీ చేస్తున్నాం అని చెప్పి బిఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీలను ప్రజలు ఎవరూ నమ్మరు అనటం ఏమిటో కెసిఆర్ కే తెలియాలి.