Telugu Gateway
Politics

కాంగ్రెస్ స‌భ్య‌త్వం..రెండు ల‌క్షల బీమా

కాంగ్రెస్ స‌భ్య‌త్వం..రెండు ల‌క్షల బీమా
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 30 ల‌క్షల స‌భ్య‌త్వాలే ల‌క్ష్యంగా ప‌నిచేయ‌నుంది. ఈ టార్గెట్ ను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం 2 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌కు పోటీనే కాదని వ్యాఖ్యానించారు. తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇతర పార్టీల నాయకత్వంలో సగం బ్రోకర్లు, సగం లోఫర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని, ఐటిని అభివృద్ధి పరిచి కంప్యూటర్, సెల్‌ను అందరికీ పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని తెలిపారు. తెలంగాణలో 30లక్షల సభ్యత్వం చేస్తామని సోనియాకు మాటిచ్చామన్నారు.

ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ ఉంటుందన్నారు. వరి కొనకుండా ప్రభుత్వం రైతులను ఉరికి ఉసి గొల్పుతోందని మండిపడ్డారు. మహేష్ అనే నిరుద్యోగ లేఖ రాసి చనిపోయాడన్నారు. 14నుంచి 21 వరకు ఏడు రోజులు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ బూతులో వంద మంది సభ్యత్వంతో మొత్తం 34 వేల బూతుల్లో 30 లక్షల సభ్యత్వం టార్గెట్ చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ కాంగ్రెస్ స‌భ్య‌త్వం అంటే ఓ గౌర‌వం అని వ్యాఖ్యానించారు. గాంధీ భ‌వ‌న్ లో సోమ‌వారం నాడు జ‌రిగిన డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ తోపాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

Next Story
Share it