Telugu Gateway
Politics

తెలంగాణ కాంగ్రెస్ లో ఆగని రగడ

తెలంగాణ కాంగ్రెస్ లో ఆగని రగడ
X

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో ఉండనంటాడు సీనియర్ నేత విహెచ్. ఓ వైపు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తనకు పదవి అక్కర్లేదని రాజీనామా చేస్తాడు. కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వరకూ ఉత్తమ్ నే ఉంచాలంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాస్తాడు. రెండుసార్లు ఎన్నికల ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా ఆ పార్టీ నేతల్లో ఏ మాత్రం మార్పులేదని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయటం ఏమి అన్నది కొంత మంది వాదన. ఇఫ్పటికే పీసీసీ అధ్యక్ష పదవి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రకటన రావటం లాంఛనం మాత్రమే అని చెబుతున్నారు. ఎక్కువ మంది జిల్లాల నేతలు, క్యాడర్ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపారు. ఓ వైపు బిజెపి దూకుడు చూపిస్తున్న తరుణంలో, అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే రేవంత్ రెడ్డి మాత్రమే సమర్థవంతమైన నేత అని ఎక్కువ మంది అంచనా.

కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉంది. ఈ తరుణంలో సీనియర్ల వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీ, రాహుల్‌, ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్‌ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. (ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని అన్నారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నారు. సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్‌ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు. సాగర్‌ ఉప ఎన్నిక వరకు పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story
Share it