నిస్సహాయ స్థితిలో తెలంగాణ కాంగ్రెస్!
తెలంగాణ కాంగ్రెస్ ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం బహిర్గతం చేస్తోంది. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి..తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేది బిజెపి మాత్రమే అని ప్రకటనలు చేస్తారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే ఓ వైపు రైతు డిక్లరేషన్ ప్రకటించి..తర్వలోనే యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి పదే పదే బిజెపికి అనుకూలంగా చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయి. అయినా సరే ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో అధిష్టానం మీనమీషాలు లెక్కిస్తోంది. అంతే కాదు..అధిష్టానం నియమించిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని గురించి జైలుకు వెళ్లొచ్చిన వారితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో తాను లేనని వ్యాఖ్యానించినా రేవంత్ కు మద్దతుగా పార్టీ సీనియర్లు స్పందించిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చిన విషయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీలకు తెలియదా?. ఒక్క మాటలో చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం రేవంత్ రెడ్డిపై అనే కంటే అధిష్టానంపైనే అని చెప్పుకోవచ్చు. అయినా సరే కాంగ్రెస్ అధిష్టానం కూడా చేష్టలుడిగి చూస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉంది.
దీన్ని కూడా బయటి పార్టీ వ్యక్తులు కాకుండా సొంత పార్టీ నాయకులే తూట్లు పొడిచేలా వ్యవహరించటం అన్నది ఇందులో హైలెట్ గా చెప్పుకోవచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణం అయితే మాత్రం అది వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డికి..బిజెపికి కూడా పెద్ద షాక్ లా మారటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలుపు విషయంతో దీన్ని ఏ మాత్రం పోల్చలేమని..ఉప ఎన్నిక అంటూ వస్తే అధికార టీఆర్ఎస్ కు మేలు చేసినట్లు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ చేరికల ఆపరేషన్ మొదలుపెట్టడంతోపాటు...ఉప ఎన్నిక అంటూ జరిగితే ఆర్ధికంగా కూడా అధికార టీఆర్ఎస్ ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢీకొట్టడం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ టార్గెట్ చేసింది కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ కీలక నేతలనే. అంతిమంగా అది రాజగోపాల్ రెడ్డికి రాబోయే రోజుల్లో రాజకీయంగా దెబ్బపడటం ఖాయం అన్న చర్చ సాగుతోంది.