Telugu Gateway
Politics

తెలంగాణ నేతల ఒత్తిడికి దిగొచ్చిన బీజేపీ అధిష్టానం!

తెలంగాణ నేతల ఒత్తిడికి దిగొచ్చిన బీజేపీ అధిష్టానం!
X

దూకుడు సంజయ్ పోయి...సాఫ్ట్ కిషన్ ఎంట్రీ!

కాంగ్రెస్ ను అడ్డుకోవటమే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అజెండానా?!

నిన్న మొన్నటి వరకు బీజేపీ తెలంగాణ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసింది. ఈ దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా ఫుల్ దూకుడు చూపిస్తూ వచ్చారు. ఎప్పుడైతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో అంతే...వెంటనే లెక్కలు అన్ని మారిపోయాయి. తెలంగాణలోని అసలు బీజేపీ నాయకులు అలా మౌనంగా ఉన్నా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ దెబ్బతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది అని చెప్పాలి. అప్పటినుంచే బండి సంజయ్ ని పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తే తప్ప పార్టీ ముందుకు సాగటం కష్టమే అంటూ చర్చ ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు పెద్దగా ఎవరి ఒత్తిళ్లకు లొంగినట్లు కనిపించని బీజేపీ అధిష్టానం మాత్రం తెలంగాణ నేతల ఒత్తిడికి తలోగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు లెక్కలు అన్ని మారిపోయాయి అని...తెలంగాణ లో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావటం అనే అంశం పక్కకు పోయి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చూడటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ఆ పార్టీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తాజా మార్పులే ఉదాహరణగా చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెపుతున్నారు. అధికార బిఆర్ఎస్ పై దూకుడు మీద ఉండే బండి సంజయ్ ను ఈ బాధ్యతల నుంచి తప్పించి.. సాఫ్ట్ గా ఉండే కిషన్ రెడ్డి కి పార్టీ బాధ్యతలు అప్పగించటం పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే తప్ప బీజేపీ ని తెలంగాణ ప్రజలు నమ్మరు అంటూ చెప్పిన బీజేపీ లో చేరిన నేతలు ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ మారిపోగానే వాళ్ళు కూడా మారిపోతారా..లేక ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే.

జాతీయ స్థాయి అవసరాల కోణంలోనే ఇప్పుడు బీజేపీ కూడా బిఆర్ఎస్ విషయంలో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాములో కవిత విషయంలో దూకుడు తగ్గించినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి రావటంతో అంతా మారిపోతుందా అంటే అది అంతా ఈజీ కాదు ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఇది ఒక్కటే కాదు అధికార బిఆర్ఎస్ విషయం లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ నాయకత్వం ఎలాంటి ధోరణితో ముందుకు వెళుతుంది అన్నది కీలకం కానుంది. ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కాగ్ తాజాగా సంచనలన విషయాలు బయటపెట్టింది. వీటి అన్నిటి విషయంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నదే ఆ పార్టీ నిజంగా బిఆర్ఎస్ తో ఫైట్ చేస్తుందా...లేక ఇది అంతా ఉత్తుత్తి రాజకీయ ఆట అన్న విషయం ఆధారపడి ఉంటుంది.

Next Story
Share it