Telugu Gateway
Politics

మోడీ పొలిటికల్ స్పీచ్ లో ఫైర్ మిస్

మోడీ పొలిటికల్ స్పీచ్ లో ఫైర్ మిస్
X

ఎన్నికల ముందు ఏ పార్టీ అయినా సాధ్యమైనంత మేర ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుంది. ఈ విషయంలో ఎంత గట్టిగా చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని లెక్కలు ఉంటాయి రాజకీయ పార్టీల్లో . ఈ ఫార్ములాను ప్రతి పార్టీ ఉపయోగిస్తుంది. అయితే రాజకీయ నాయకులు చెప్పేవన్నీ నిజాలు అని కూడా నమ్మలేము. అబద్ధాలను కూడా కొంత మంది తమ ఆర్ట్ తో అద్భుతంగా చెప్తూతూ ప్రజలను బురిడీ కొట్టిస్తుంటారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఒక వైపు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో కూడా మాట్లాడారు. అయితే ప్రధాని మోడీ స్పీచ్ చూసిన తర్వాత తెలంగాణలో అధికార బిఆర్ఎస్ , బీజేపీ లు ఒకటే అనే అభిప్రాయం మరింత బలంగా కలిగేలా ఉంది అని తెలంగాణ బీజేపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మోడీ స్పీచ్ లో ఏ మాత్రం ఫైర్ లేదు అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెర మీదకు వచ్చినప్పుడు కూడా ఒకసారి మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు అని ..అప్పుడు అయన ఒక మీటింగ్ లో తన ముందు ఉన్న బల్లను గట్టిగా గుద్దుతూ కెసిఆర్ సర్కారు పై మాట్లాడారు అని..కానీ ఇప్పుడు ఎన్నికల ముందు అధికార బిఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సినంతగా చేయలేదు అనే చర్చ బీజేపీ నాయకుల్లో కూడా వ్యక్తం అవుతుంది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి అసలు మోడీ నోరెత్తలేదు. ఈ కేసులో తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్యే కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగానే తెలంగాలో ఉన్నదీ అవినీతి, కమిషన్ ల ప్రభుత్వం వంటి రొటీన్ డైలాగులతోనే సరిపెట్టారు. బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటంతో డీలా పడి ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు, క్యాడర్ కు మోడీ ఏమైనా కొత్త జోష్ ఇచ్చారా అంటే అది కూడా లేకుండా పోయింది అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. తెలంగాణ కు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీల వంటి ప్రకటన మంచిదే అయినా...పసుపు బోర్డు డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదే..అదే సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది కూడా. మరో వైపు గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలో ఉన్న అంశం. ఈ రెండు కూడా ఎన్నికల షెడ్యూల్ రావటానికి పక్షం ముందు ప్రకటించటం వల్ల రాజకీయంగా కలిగే ప్రయోజనంపై కూడా బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార బిఆర్ఎస్ పై మోడీ వంటి నాయకుడు విమర్శల డోస్ పెంచకపోతే రెండు పార్టీ లు ఒక్కటే అనే విషయాన్నీ ప్రజలు బలంగా నమ్మే అవకాశం ఉంది అనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అక్టోబర్ మూడున నిజామాబాద్ పర్యటనలో కూడా మోడీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతారా లేక మార్పులు ఏమైనా ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it