గజ్వేల్ లో అత్యధిక నామినేషన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. దీంతో అసలు లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. సీఎం కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నామినేషన్స్ వేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎక్కువ మంది బిఆర్ఎస్ సర్కారు బాధితులు ఉండటం విశేషం. గజ్వేల్ బరిలో మొత్తం 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ బిఆర్ఎస్ నుంచి కెసిఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి టి. నర్సారెడ్డి పోటీ లో ఉన్నారు. మిగిలిన వారంతా టార్గెట్ కెసిఆర్ గా పోటీ చేసిన వారే కావటం విశేషం. గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పోటీ లో ఉన్నారు.
ఇక్కడ మొత్తం 67 మంది నామినేషన్స్ వేశారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పోటీ చేస్తున్న రెండవ నియోజకవర్గం కామారెడ్డి లో కూడా పెద్ద ఎత్తున నామినేషన్స్ దాఖలు అయ్యాయి. ఇక్కడ మొత్తం 58 నామినేషన్స్ దాఖలు అయ్యాయి. ఇక్కడ కెసిఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎల్ బి నగర్ నియోజకవర్గంలో 50 మంది బరిలో ఉంటే...టీపీసీసీ ప్రెసిడెంట్ పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గం లో 15 మంది పోటీ చేస్తున్నారు. నామినేషన్స్ పరిశీలన తర్వాత మొత్తం 2898 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలనలో 606 నామినేషన్స్ తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు బుధవారం నాడే ముగియనుంది. తర్వాత పోటీలో ఎంత మంది ఉంటారు అనే అసలు లెక్కలు రానున్నాయి.