Telugu Gateway
Politics

టీడీపీ 'టార్గెట్ ఎన్టీఆర్'!

టీడీపీ టార్గెట్ ఎన్టీఆర్!
X

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఎన్టీఆర్ స్పందించిన తీరుపై ఆయ‌న వీడియో విడుద‌ల చేసిన రోజే చాలా మంది స్పందించారు. అస‌లు మాట్లాడ‌క‌పోయినా బాగుండేదని...ఎన్టీఆర్ మాట్లాడిన తీరు ఏ మాత్రం స‌రిగా లేదంటూ టీడీపీ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. మ‌రో వైపు వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ కూడా ఎన్టీఆర్ స్పంద‌న‌పై ప్ర‌తికూల వ్యాఖ్య‌లే చేసింది. ఎన్టీఆర్...నువ్వు ఎంత స్పందించినా ఆ కుటుంబ స‌భ్యుడిగా వాళ్లు ఎప్ప‌టికీ నిన్ను అంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. స్పందించినందుకు టీడీపీ సంతృప్తి చెంద‌లేదు. స్పందించినందుకు వైసీపీ సోష‌ల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే స్పందించి రెండికిచెడ్డ రేవ‌డిగా మారాడు. ఈ ఎపిసోడ్ అంతా సద్ధుమ‌ణిగింది అనుకుంటున్న త‌రుణంలో టీడీపీ నేత‌లు నేరుగా ఎన్టీఆర్ పై ఎటాక్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న గురువారం నాడు ఎన్టీఆర్ ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ అసెంబ్లీ ఘ‌ట‌న‌పై ఎన్టీఆర్ తీరు తాము ఏదో సింహాద్రి, ఆది సినిమాల త‌ర‌హాలో ఉంటుంది అనుకుంటే చాగంటి ప్ర‌వ‌చ‌నాలు చెప్పార‌ని ఎద్దేవా చేశారు.

ఆయ‌న స్పందించిక‌పోయినా బాగుండేద‌ని..స్పందించిన తీరు మాత్రం బాగాలేద‌న్నారు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు ఎన్టీఆర్ కు స‌న్నిహితులు అని ప్ర‌చారం ఉంద‌ని..అందుకైనా ఆయ‌న వీరి వ్యాఖ్య‌ల‌పై స్పందించి ఉండే బాగుండేద‌న్నారు. అదే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అంబటి రాంబాబుల విష‌యంలో అయితే ఎవ‌రూ ఎన్టీఆర్ స్పంద‌న‌ను ఎవ‌రూ ఆశించ‌ర‌ని..ఎన్టీఆర్ స్నేహితులు అని ప్ర‌చారంలో ఉన్న వాళ్లు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎన్టీఆర్ స‌రిగా మాట్లాక‌పోవ‌టం స‌రికాద‌న్నారు. పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య కూడా ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ''మీ నాన్న బతికుంటే ఇంకో రకంగా ఉండేది. సీతయ్య(హరికృష్ణ) బతికుంటే నేరుగా రంగంలోకి దిగేవాడు. రచ్చ రచ్చ చేసుండేవాడు. అలా మీరు(ఎన్టీయార్) ఎందుకు చేయలేకపోయారు? మీ నాన్నకు చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా?.. మీ మేనత్తను అంటే ఇలాగేనా స్పందించేది?'' అంటూ వర్ల రామయ్య ప్ర‌శ్నించారు. జూనియర్ ఎన్టీయార్ స్పందన ప్రవచనాలు చెప్పినట్లు ఉందని, ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీయార్ అంటే కొడాలి నానికి, వల్లభనేని వంశీకి చాలా భయమని చెప్పారు. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారని వర్ల అభిప్రాయపడ్డారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారని తెలిపారు.

విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ స్పంద‌న వీడియో వ‌చ్చిన ఇన్ని రోజుల‌కు వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారంటే ఇది అంతా ప‌క్కా వ్యూహంతోనే సాగుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఎందుకంటే బుద్ధా వెంక‌న్న చంద్ర‌బాబు, నారా లోకేష్ లకు అత్యంత స‌న్నిహితుడు అని పేరుంది. నిజంగా వీరిద్ద‌రూ ఎన్టీఆర్ స్పందించిన తీరును ప్ర‌శ్నించాల‌నుకుంటే అదే రోజు సాయంత్ర‌మో..మ‌రుస‌టి రోజే స్పందించి ఉంటే ఎవ‌రూ పెద్ద‌గా త‌ప్పుప‌ట్టే వారు కాదు. కానీ ఇన్ని రోజుల త‌ర్వాత బుద్ధా వెంక‌న్న‌, వ‌ర్ల రామ‌య్య‌లు ప‌నిక‌ట్టుకుని ఎన్టీఆర్ పేరును మళ్ళీ వివాదంలోకి లాగారంటే ఇది అంతా పార్టీ పెద్ద‌ల ఆదేశాల మేర‌కే జ‌రుగుతుంద‌నే అభిప్రాయం కొంత మంది నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌టి మాత్రం వాస్త‌వం. ఎన్టీఆర్ విడుద‌ల చేసిన వీడియోలో మాత్రం ఎవ‌రిని ఏమి అంటే త‌మ కొత్త సినిమా ఆర్ఆర్ఆర్ కు ఎక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తాయో అన్న త‌ర‌హాలోనే సాగింది. అస‌లు తాను ఎందుకు ఆ వీడియో విడుదల‌ చేయాల్సి వ‌చ్చింది..నిజంగానే చంద్రబాబు భార్య భువ‌నేశ్వ‌రిని అసెంబ్లీలో వైసీపీ నేత‌లు అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని భావించి ఉంటే ఎన్టీఆర్ స్పందించాల్సిన తీరు అది మాత్రం కాద‌న్న‌దే ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ఇప్పుడు టీడీపీ నేత‌లు మ‌ళ్లీ ఆయ‌న్ను వివాదంలోకి లాగటం ద్వారా పార్టీలో ఆయ‌న‌కు అభిమానులు ఎవ‌రైనా మిగిలి ఉంటే వారిని మ‌రింత దూరం చేసేందుకే వేసిన ఎత్తుగడ గానే అభివ‌ర్ణిస్తున్నారు.

Next Story
Share it