అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సోమవారం నాడు శాసనసభ, మండలిలో టీడీపీ ఆందోళనలకు దిగింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవటంలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పోడియం వద్ద ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.. మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయస్వామి బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెన్షన్‌కు గురయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ వీరిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
అయితే తాము అడిగింది ప్రజా సమస్య అని.. దానిపై చర్చించమని అడిగితే సస్పెన్షన్ చేయడం ఎంతవరకూ సమంజమసమని స్పీకర్ పోడియం చుట్టుముట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు కదలకపోవడంతో వారిని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని..అయినా ఆందోళన వెనక అర్ధం లేదని ప్రభుత్వం మండిపడింది. అదే సమయంలో సహజ మరణాలను కూడా టీడీపీ రాజకీయానికి వాడుకుంటోందని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.