సోప్ తెచ్చిన తంట

కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు సినీ సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటూ ఒప్పందాలు చేసుకుంటాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక కు చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ చేసిన పని వివాదానికి కారణం అయింది అనే చెప్పాలి. తమన్నా భాటియా ఏ మాత్రం పరిచయం అక్కరలేని పేరు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ తో పాటు పలు బాషల సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే చాలా మంది కొత్త హీరోయిన్లు రావటంతో ఇప్పుడు తమన్నాకు పెద్దగా ఛాన్స్ లు రావటంలేదు అనే చెప్పొచ్చు. అలా అని అసలు సినిమాలు లేవు అని చెప్పలేం. కెరీర్ తుది దశలో ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ లతో పాటు అడపాదడపా పలు సినిమాల్లో ఐటెం సాంగ్ ఛాన్సులు కూడా దక్కించుకుంటోంది. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా కర్ణాటక సర్కారు తమన్నా భాటియా తో ఒక ఒప్పందం చేసుకుంది. మైసూర్ శాండిల్ సోప్ ఎంత పాపులరో అందరికి తెలిసిన విషయమే. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయటానికి కర్ణాటకకు చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ 6 . 2 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం రెండు సంవత్సరాలు అమల్లో ఉండనుంది. అయితే కన్నడ కు చెందిన ఎంతో మంది పాపులర్ హీరోయిన్స్ ఉండగా హిందీ హీరోయిన్ ను తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు స్టార్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్ ను బ్రాండ్ అంబాసడర్ గా పెట్టి ఉండాల్సింది అంటూ మరి కొంత మంది సూచించారు. ఈ వివాదం పెద్దది అవుతుండటంతో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎం బి పాటిల్ కూడా స్పందించారు. ఎన్నో అంశాలు చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నాం అని...ఒక్క కర్ణాటకలోని కాకుండా ఇతర మార్కెట్లలో కూడా వేగంగా మైసూర్ శాండల్ సోప్ ను తీసుకెళ్ళటానికే ఈ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కెఎస్ డిఎల్) వివిధ మార్కెటింగ్ ఏజెన్సీలతో చర్చలు జరిపిన తర్వాత కంపెనీ బోర్డు స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. 2028 సంవత్సరం నాటికి కెఎస్ డిఎల్ వార్షిక ఆదాయం 5000 కోట్ల రూపాయలకు పెంచటమే లక్ష్యం గా పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మరి తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్ గా మైసూర్ శాండిల్ సోప్స్ అమ్మకాలు ఏ మేరకు పెంచుతారో చూడాలి.



