గులాబీ గూటికి టీ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ!
తెలంగాణ తెలుగుదేశం ఖాళీ సంపూర్ణం కానుంది. చివరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కూడా జెండా ఎత్తేయనున్నారు. ఆయన కూడా అధికార గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు గాను ఆయనకు ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో చోటు కల్పిస్తారని సమాచారం. దీనికి అవసరమైన చర్చలు ప్రస్తుత మంత్రి, ఒకప్పటి రమణ సహచరుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తి చేశారని చెబుతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయటం..ఆయన టీఆర్ఎస్ పై..ముఖ్యంగా అధినేత కెసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్ ను బానిస భవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కసిగా ఉన్న కెసీఆర్ ఎలాగైనా ఈటెల రాజేందర్ ను ఓడించటమే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఇందుకు ఆయన అన్ని అస్త్రాలు వాడుకునే పనిలో పడ్డారు. రమణ రాకతో టీఆర్ఎస్ కు బలం పెరుగుతుందా..లేదా అనే సంగతి పక్కన పెడితే..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను చేర్చుకోవటం ద్వారా ఫీల్ గుడ్ కలర్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు.
అంతా తమవైపే ఉన్నారనే సంకేతాలు ఇవ్వటానికి ఇలాంటి పనికొస్తాయని నేతలు బలంగా నమ్ముతారు. దీనికి తోడు అధికారం..డబ్బు అండదండలు ఎలాగూ ఎన్నికల సమయంలో కామన్. ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు ప్రస్తుత జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రమణతో మాట్లాడినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎప్పుడో వదిలేశారు. ఏపీలో అధికారం పోయిన తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది.