Telugu Gateway
Politics

మోడీ విమానంలో స్విమ్మింగ్ పూల్..నిజం ఎంత‌?

మోడీ విమానంలో స్విమ్మింగ్ పూల్..నిజం ఎంత‌?
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఉప‌యోగించే ఇండియా వ‌న్ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉందా?. అస‌లు విమానంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు సాధ్యం అవుతుందా?. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, లోక్ స‌భ స‌భ్యుడు అధిర్ రంజ‌న్ చౌద‌రి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఉప‌యోగించే విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉంద‌ని..విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ళే స‌మ‌యంలో అందులో స్విమ్మింగ్ చేసి త‌ర్వాత స‌మావేశాల్లో ప్రసంగాలు చేసి వ‌స్తార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ ప‌ర్య‌ట‌న‌, నైట్ క్ల‌బ్ లో రాహుల్ ఓ మ‌హిళ‌తో క‌న్పించిన వీడియోపై బిజెపి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన త‌రుణంలో ఆయ‌న మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్ ను చూసి బిజెపి భ‌య‌ప‌డుతోంద‌ని..అందుకే అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని ఆరోపించారు. రాహుల్ త‌న సొంత ఖ‌ర్చుతోనే నేపాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని..బిజెపి నేత‌ల విమ‌ర్శ‌ల‌కు అర్ధంలేద‌ని అంటూ మీడియా స‌మావేశంలో మండిప‌డ్డారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది..అస‌లు విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉండ‌టం సాధ్యం అవుతుందా అన్న విష‌యం ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా అంత సీనియ‌ర్ నేత ఈ విమ‌ర్శ‌లు చేయ‌టంతో మ‌రోసారి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి. అస‌లు ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచంలో ఏ విమానంలో కూడా స్విమ్మింగ్ పూల్ అనేది లేద‌ని..అది సాధ్యంకాద‌ని నిపుణులు తేల్చారు.

ఓ సారి ఎమిరేట్స్ సంస్థ ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఏ380 డ‌బుల్ డెక్క‌ర్ త‌ర‌హాలో త్రిబుల్ డెక్క‌ర్ విమానం రానుంద‌ని..అందులో స్విమ్మింగ్ పూల్ తోపాటు పార్క్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఏప్రిల్ 1న ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపింది. త‌ర్వాత అది అంతా ఏప్రిల్ పూల్ జోక్ గా తేల్చారు. అస‌లు స్విమ్మింగ్ పూల్ లో మ‌నిషి దిగితేనే అందులోని నీళ్లు నాలుగు వైపులా ఒత్తిడికి కొట్టుకుంటాయి. అలాంటిది విమానంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి అందులోకి దిగటం అనేది జ‌రిగే ప‌నికాద‌ని చెబుతున్నారు. వివిఐపిల విమానాల్లో అత్యాధునిక ర‌క్షణ వ్య‌వ‌స్థ‌తోపాటు స‌మావేశ మందిరాలు..విశ్రాంతి తీసుకునేందుకు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు ఉంటాయి కానీ..స్విమ్మింగ్ పూల్ అనేది సాధ్యం కాదు. ఎమిరేట్స్. ఖ‌తార్ ఎయిర్ వేస్ లు దుబాయ్ నుంచి అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల‌కు న‌డిపే స‌ర్వీసుల్లో ఏకంగా ఇంట్లో నిద్రించే త‌ర‌హాలో అపార్ట్ మెంట్ పేరుతో పూర్తి స్థాయి బెడ్స్ తో విలాస‌వంత‌మైన‌ సౌక‌ర్యాల‌ను ఎప్పుడో అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.అంతే కాదు..కోరుకున్న ఆహారాన్ని వారికి అందిస్తారు కూడా.




Next Story
Share it