Telugu Gateway
Politics

అంబులెన్స్ లు ఆపటం అమానవీయం

అంబులెన్స్ లు ఆపటం అమానవీయం
X

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే కరోనా పేషంట్ల అంబులెన్స్ లను ఆపుతున్న ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న పేషంట్లతో కూడిన అంబులెన్సు లను సరిహద్దుల్లో ఆపడం అమానవీయమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, అధికారులు చర్చించుకొని ఈ సమస్యకు పరిష్కారం కనుగోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఈ విషయం పై, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడారన్నారు. హైదరాబాద్ లో వైద్య సేవలు పొందటం కోసం తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ నుండి పేషంట్లను తీసుకువస్తున్న అంబులెన్స్ వాహనాలను తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో ఆపడం మంచి సాంప్రదాయం కాదన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయం, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఉన్నతాధికారులు చర్చించుకుని సమస్యకు పరిష్కారం చెయ్యాలి తప్ప, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్లమీద ప్రాణాలు దక్కించుకోవడం కోసం మృత్యువుతో పోరాడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. మానవీయ కోణంలో ఆలోచన చేయాల్సిన ఈ అంశంలో, సాధారణ వాహనాలను, కరోనాకు వైద్యం కోసం కొన ఊపిరితో వచ్చే పేషంట్స్ ను ఆపడం మంచి పద్దతి కాదని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ విషయంలో చొరవ తీసుకొని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి, సమస్య పరిష్కారానికి చొరవతీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద గంటలు, రోజుల తరబడి పేషంట్లను ఆపడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.

Next Story
Share it