పెట్రోల్ పై రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి
ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి పెట్రో ఉత్పత్తుల ధరలపై స్పందించారు. కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినా బిజెపియేతర పాలిత రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించటం లేదని..ఇది ఏ మాత్రం సరికాదన్నారు. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొడానికి మనమంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఈ సందర్భంగానే దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కూడా మోదీ స్పందించారు.
పెట్రోల్ ధరలపై మోదీ స్పందిస్తూ.. ''కొన్ని రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాయి. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని మిగతా రాష్ట‍్రాలను కోరుతున్నా. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్‌పై పన్నులు తగ్గించండి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉత్తరాఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104 ఉండగా.. ఎక్కువగా మహారాష్ట్రలో లీటర్ రూ. పెట్రోల్ ధర రూ. 122గా ఉందని'' తెలిపారు. బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీలో పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని మోడీ కోరారు. అప్పుడే ప్రజలపై పెట్రో భారం తగ్గుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు.