శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా
ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కీలక పరిణామం. ఆ దేశ ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొంత కాలంగా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలు, లంక ప్రజలు.. అధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. శ్రీలంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఇందుకు అక్కడ కీలక ప్రతిపక్షం ససేమిరా అంటోంది. ఓ వైపు నిరసనకారుల ఉద్యమాలు..మరో వైపు ప్రభుత్వ అనుకూల వర్గాల ఘర్షణతో అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది.
ఆర్ధిక సంక్షోభం కారణంతో అన్ని నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర సమస్యల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు అసలు పెట్రోల్, డీజిల్ కూడా దొరక్క పరిస్థితులు దారుణంగా మారాయి. శ్రీలంకకు భారత్ ఇంథనంతోపాటు ఆర్ధిక సాయం కూడా అందజేసింది. ఇప్పటికే ఆ దేశం పలు దేశాల సాయం కోరి సమస్య నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇది ఎప్పటికి కొలిక్కివస్తుందో ఎవరికీ అంతుచిక్కటం లేదు. దేశంలోని పరిస్థితులతో శ్రీలంక పర్యాటక కూడా పూర్తిగా పడకేసింది. అల్లర్ల కారణంగా ఆసక్తి ఉన్న వారు సైతం అటువైపు చూడటంలేదు.