భూముల అమ్మకంపై టీఆర్ఎస్ ది అప్పుడో మాట..ఇప్పుడో మాట
తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు స్పందించారు. టీఆర్ఎస్ గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిందని..ఇప్పుడు మాత్రం భూముల అమ్మకాన్ని సమర్ధించుకుంటూ మాట్లాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందని వారి నిర్ణయాలు చూస్తే తెలుస్తోందని అన్నారు. ''రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల భూమిని అమ్మాలని చూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆస్తులను కాపాడుకునేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మ లేదా అని హరీష్ రావు అంటున్నారు. ఆనాడు ఆస్తులు అమ్మతుంటే వద్దని మేము ఆనాటి ముఖ్యమంత్రి కి చెప్పాం.
జిల్లాలో భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని'' ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. 'నేను పీసీసీ రేసులో లేను.. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్న అంగీకారమే.. దానికి కట్టుబడి ఉంటాను'' అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ''ఆరున్నర సంవత్సరాలుగా అనేక పనులు కూడా ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయి. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణేతరులకు భూములు అమ్మే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో వేల ఎకరాలు పేదలకు పంచాం. పొడు భూములు కూడా పంపిణీ చేశాం. మన భూములను మన తెలంగాణ రాష్ట్ర సమితి అమ్మే ప్రయత్నం చేస్తోంది.. మిమ్మల్ని ఏ విదంగా వెల్లగొట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు'' అంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇప్పుడు భూములు అమ్మేస్తే భవిష్యత్ ప్రభుత్వ అవసరాలకు భూములు ఎక్కడ నుంచి వస్తాయన్నారు.