మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
శ్రీలంక గత కొన్ని నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. పాలకుల అసమర్ధత, అస్తవ్యస్థ విధానాలు, అవినీతి అన్నీ కలిపి ఇప్పుడు శ్రీలంకను తీవ్ర సమస్యల్లోకి నెట్టాయి. దీంతో ఈ ద్వీపదేశం ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ తరుణంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం తెల్లవారుజామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. గొటబాయ కుటుంబం మాల్దీవులకు వెళ్లిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్ధారించారు. వారి పాసుపోర్టులపై స్టాంపులు వేసినట్లు పేర్కొన్నారు.తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించారు గొటబాయ. సరిగ్గా అదే రోజు దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు గొటబాయను అరెస్టు చేయడానికి వీల్లేదు.
రాజీనామా చేసిన తర్వాత తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే అంతకంటే ముందే ఆయన దేశం వీడి పారిపోయినట్లు తెలుస్తోంది. తన కుటుంబాన్ని వెళ్లినిస్తేనే రాజీనామా చేస్తానని గొటబాయ అధికారులకు చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి గొటబాయ సోమవారమే వాణిజ్య విమానంలో దుబాయ్ పారిపోవాలని ప్రయత్నించారు. అయితే ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అతన్ని వీఐపీ టర్మినల్ ద్వారా వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. సాధారణ ప్రజల్లా పబ్లిక్ కౌంటర్ నుంచే రావాలని సూచించారు. జనం తమను చూస్తే ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతో ఆయన పబ్లిక్ కౌంటర్ వైపు వెళ్లలేదు. 24 గంటలు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అవమానంతోనే వెనుదిరిగారు. చివరకు సైనిక విమానంలో బుధవారం వేకువజామున దేశం వీడారు. స్పీకర్ కు రాజీనామా పత్రాలు ఇచ్చే ఆయన దేశం వీడినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో శ్రీలంకలో అన్ని పార్టీలతో కలిపి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు.