అమిత్ షాకు క్రీడా శాఖ బెటర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై బిజెపి నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను హోం మంత్రిగా రాజీనామా చేయమని కోరటం బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు..ఆయనకు క్రీడా శాఖ అయితే మంచిది అంటూ ఎద్దేవా చేశారు. కాశ్మీర్ లోయలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. కానీ నిత్యం అక్కడ కశ్మీరీ హిందువుల హత్యకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో క్రీడలకు బాగా ఆదరణ పెరిగినందున అమిత్ షాకు ఆ శాఖ అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం కూడా సుబ్రమణ్యస్వామి అమిత్ షా టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే ముగిసిన టీ20 ఫైనల్స్ లో గుజరాత్ టీమ్ గెలిచింది. అయితే ఇందులో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని..దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత క్రికెట్ బోర్డుకు అమిత్ షా తనయుడు నియంతగా ఉన్నందున ప్రభుత్వంలో ఇందులో జోక్యం చేసుకుంటుందని ఆశించటం అత్యాశే అవుతుందని అన్నారు. ఇప్పుడు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అమిత్ షా రాజీనామా డిమాండ్ చేశారు.