Telugu Gateway
Politics

కాంగ్రెస్ లోకి సోనూసూద్ సోద‌రి

కాంగ్రెస్ లోకి సోనూసూద్ సోద‌రి
X

పంజాబ్ రాజ‌కీయాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా రావ‌టంతో పార్టీలు అన్నీ వేగంగా పావులు క‌దుపుతున్నాయి. క‌రోనా స‌మ‌యంలో త‌న సేవా కార్య‌క్ర‌మాల ద్వారా దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకున్న ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ సోద‌రి మాళ‌విక సూద్ సోమ‌వారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆమె పోటీచేస్తుంద‌ని సోనూసూద్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే ఆమె కాంగ్రెస్ లో చేర‌టంతో ఏ పార్టీ నుంచి అనే స‌స్పెన్స్ కు తెర‌ప‌డింది. సోమవారం పంజాబ్‌లోని మోగాలో ఉన్న సోనూసూద్ నివాసానికి స్వయంగా వెళ్లిన పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. సోనూతో పాటు ఆయన సోదరితో కాసేపు చర్చించారు. ఆ త‌ర్వాత వీరంతా క‌ల‌సి సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ, సిద్ధూల స‌మ‌క్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మాళ‌విక రాజకీయ ఆరంగేట్ర ప్రకటనకు కొద్ది రోజుల ముందే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని సోనూ సూద్ కలుసుకోవడంతో వీరు కాంగ్రెస్ లో చేర‌తార‌ని అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి.

గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను సైతం సోనూ కలుసుకున్నప్పటికీ కాంగ్రెస్‌వైపే వీరు మొగ్గు చూపిన‌ట్లు అయింది. మాళ‌విక సూద్ తోపాటు త్వ‌ర‌లోనే ఇటీవ‌ల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా కాంగ్రెస్ లో చేరే అవ‌కాశం ఉంద‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం సిద్ధూ, హ‌ర్బ‌జ‌న్ సింగ్ లు భేటీ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తిరిగి అధికారాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. మ‌రో వైపు ఆమ్ అద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ లో పాగా వేసేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంది. రైతు చ‌ట్టాల‌తో బిజెపికి అక్క‌డ ఇప్పుడు భారీ ఎత్తున ఎదురుగాలి వీస్తోంది. మోడీ స‌ర్కారు తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించిన వారిలో పంజాబ్ రైతులు ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ఎవ‌రి అవ‌కాశాల‌కు గండికొడ‌తారో అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it