Telugu Gateway
Politics

పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసింది అన్న సోనియా

పొలిటికల్ ఇన్నింగ్స్  ముగిసింది అన్న సోనియా
X

కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిగా రాహుల్ గాంధీ చేతుల్లోకి వెళ్ళనుంది. . ఎందుకు అంటే ఇప్పటివరకు ఆ పార్టీ ని వెనకుండి నడిపించిన సోనియా గాంధీ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే. రాయపూర్ లో జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో ఆమె ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ లో కీలక పాత్రే పోషిస్తున్నా కూడా ఏదైనా సమస్య వస్తే అందరూ సోనియా గాంధీ వైపే చూస్తూ వస్తున్నారు. ఇక నుంచి అది కూడా ఉండే అవకాశం లేదనే సంకేతాలు వచ్చాయి. శనివారం నాడు కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావించారు. భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. శనివారం సోనియా ప్లీనరీ లో ప్రసంగిస్తూ... ''భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారు. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ విదేశ్వాగ్ని రగులుస్తోందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను టార్గెట్ చేసుకుంటోందని అన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు దేశానికీ, కాంగ్రెస్ పార్టీ కి కూడా ఎంతో కీలకం అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో కాస్త జోష్ తెచ్చారని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే ప్లీనరి సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. దీనికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

Next Story
Share it