Telugu Gateway
Politics

పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ గా న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ గా న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ
X

పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ గా న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. సిద్ధూతోపాటు సంగ‌త్ సింగ్ గిల్జాన్, సుఖ్వీంద‌ర్ సింగ్ డానీ, ప‌వ‌న్ గోయెల్, కుల్జీత్ సింగ్ నాగ్రాల‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లుగా నియ‌మించారు. అయితే పీసీసీ ప్రెసిడెంట్ గా సిద్ధూ నియామ‌కాన్ని పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా కొలిక్కివ‌చ్చిన‌ట్లు క‌న్పించ‌టం లేదు.

అయినా పార్టీ అధిష్టానం మాత్రం సిద్ధూ విష‌యంలో ముందుకెళ్ళ‌టానికే నిర్ణ‌యించుకుని పీసీసీ నియామ‌కం చేప‌ట్టింది. మ‌రి దీనిపై అమ‌రీంద‌ర్ సింగ్, ఆయ‌న వ‌ర్గం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే ఇప్ప‌టివ‌ర‌కూ పీసీసీ ప్రెసిడెంట్ గా సేవ‌లు అందించిన సునీల్ జాక‌ర్ సేవ‌ల‌ను పార్టీ ప్ర‌శంసించింది. ప్ర‌స్తుతం సిక్కిం, నాగాలాండ్, త్రిపుర‌ల ఏఐసీసీ ఇన్ ఛార్జిగా ఉన్న కుల్జీత్ సింగ్ ను ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు.

Next Story
Share it