దేశభక్తుల నిజస్వరూపం బయటపడింది
మోడీ సర్కారుపై సోనియా ధ్వజం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఇతరుల దేశభక్తిపై సర్టిఫికెట్లు జారీ చేసే వారి అసలు రంగు భయటపడిందని ధ్వజమెత్తారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణాబ్ గోస్వామి వాట్సప్ చాట్ లీక్ వ్యవహారంపై మోడీ సర్కారు ఎందుకు మౌనంగా ఉంటుందని ఆమె నిలదీశారు. ఈ అంశంపై జెపీసీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. జూన్ లో నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించారు.శుక్రవారం సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోనియా... అర్ణాబ్ వాట్సాప్ చాట్ పై ఇంత గొడవ జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపరీతమైన మౌనం పాటిస్తోందని, ఆ మౌనంతో తమ చెవులు బద్దలవుతున్నాయని ఎద్దేవా చేశారు. జాతీయ భద్రత లాంటి కీలకమైన అంశంలో ప్రభుత్వం రాజీపడిందని ఆరోపించారు. ''జాతీయ భద్రత విషయంలో కేంద్రం ఎంత రాజీపడిందో ఈ మధ్యే భయంకరమైన రిపోర్టులు బయటికొచ్చాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను బహిరంగపరిస్తే అది దేశద్రోహం అని ఏకే ఆంటోనీ కొన్ని రోజుల క్రితమే పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. విపరీతమైన మౌనం పాటిస్తోంది.'' అని సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సోనియా సీడబ్ల్యూసీ వేదికగా స్పందించారు. రైతుల విషయంలో కేంద్రం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం హడావుడిగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని అర్థమైపోతుందని, ఈ చట్టాల్లో ఉన్న లోతుపాతులను, లాభనష్టాలను పార్లమెంట్ చర్చించే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించలేదని సోనియా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానం మాత్రం ఈ చట్టాల విషయంలో మొదటి నుంచి చాలా స్పష్టంగానే ఉందని ఆమె కుండబద్దలు కొట్టారు. ''రైతు చట్టాల విషయంలో మన విధానం మొదటి నుంచి చాలా స్పష్టంగానే ఉంది. మొదటి నుంచి వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఆహార భద్రతలో ఉన్న మౌలిక సూత్రాలైన పాటు కనీస మద్దతు ధర, పౌర సరఫరా లాంటి వ్యవస్థల్ని ఈ చట్టాలు సర్వ నాశనం చేస్తాయి.'' అని సోనియా గాంధీ తెలిపారు.