Telugu Gateway
Politics

టీఆర్ఎస్ లోకి సిద్ధిపేట మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి

టీఆర్ఎస్ లోకి సిద్ధిపేట మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి
X

వెంక‌ట్రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి. ఆయ‌న చ‌ర్య‌లు ప‌లుమార్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన నూత‌న క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో ఆయ‌న ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు పాదాభివంద‌నం చేసి క‌ల‌క‌లం రేపారు. ఆయ‌న చ‌ర్యపై అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలా చేయ‌టం ఏ మాత్రం స‌రికాదంటూ సీనియ‌ర్ అధికారులు వ్యాఖ్యానించారు. తాజాగా వరి విత్త‌నాల విక్ర‌యానికి సంబంధించి కూడా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. తన ఆదేశాలు ధిక్క‌రించిన ఎవ‌రైనా వ‌రి విత్త‌నాలు విక్ర‌యిస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు లు చెప్పినా స‌రే వారి లైసెన్స్ ల‌ను పున‌రుద్ధ‌రించ‌లేద‌ని లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ వీడియో పెద్ద దుమారమే రేపింది. తెలంగాణ హైకోర్టు సైతం క‌లెక్ట‌ర్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ త‌రుణంలో ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ఉద్యోగం నుంచి ఆయన స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు.

వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు ప్ర‌చారం జరుగుతోంది. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల. 1991 లో గ్రూప్-1 అధికారిగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ సర్వీస్‌ల్లో చేరారు. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆయన ఆర్డీవోగా పనిచేశారు. మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పని చేశారు. రాజీనామా ఆమోదం అనంత‌రం వెంక‌ట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కెసీఆర్ స‌ర్కారు ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌జ‌ల కోసం కృషి చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ తో ఉండాల‌నే ఉద్దేశంతోనే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలిపారు. రానున్న వంద సంవ‌త్స‌రాలు తెలంగాణ గురించి ప్ర‌జ‌లు చెప్పుకునేలా సీఎం కెసీఆర్ అభివృద్ధి చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ పిలుపు వ‌చ్చాక టీఆర్ఎస్ లో చేర‌తాన‌ని..ఆయ‌న మార్గ‌నిర్దేశం ప్ర‌కారం ప‌నిచేస్తాన‌ని తెలిపారు.

Next Story
Share it