Telugu Gateway
Politics

చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త పెంపు..కీలక ప‌రిణామం

చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త పెంపు..కీలక ప‌రిణామం
X

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఇత‌ర పార్టీలు అదికారంలో ఉన్న చోట కేంద్రం క‌ల్పిస్తున్న స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఢిల్లీ, మ‌రో వైపు జార్ఖండ్..బీహార్ లో ఇలా ప్ర‌తి రాష్ట్రంలోనూ పాత కేసులు తిరగ‌తోడి..సీబీఐ కేసులు..ఈడీ దాడులు అంటూ హంగామా చేస్తోంది. దీనిపై అక్క‌డి అధికార పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తున్నాయి. అటు బిజెపి..ఇటు కేంద్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చుతున్నాయి. ఒక‌టి మాత్రం నిజం అటు కేంద్రం అయినా..బిజెపి పార్టీ అయినా త‌మ‌కు న‌చ్చ‌ని వారి విష‌యంలో మాత్రం చాలా నిష్క‌ర్ష‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఏ మాత్రం సానుభూతి కూడా చూపించ‌దు. ఈ త‌రుణంలో ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడికి కేంద్రం భ‌ద్ర‌త పెంచ‌టం అన్న‌ది కీల‌క ప‌రిణామంగా మారింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌ల‌కు అధికార వైసీపీ నుంచి చాలా చోట్ల ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయి.

తాజాగా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లు బాహ‌బాహీకి కూడా దిగారు. గ‌తంలో ఏకంగా చంద్ర‌బాబు నివాసంపైకే వైసీపీ కార్య‌క‌ర్త‌లు వెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యాల‌యంపై దాడి చేశారు. ఈ త‌రుణంలో కేంద్రం చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న సంఖ్య కంటే ఆయ‌న‌కు అద‌న‌పు ఎన్ ఎస్ జీ క‌మాండోల‌ను జ‌త చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బిజెపి, జ‌న‌సేన క‌ల‌సి పోటీచేస్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో ఈ భ‌ద్ర‌త పెంపు కూడా రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. చంద్ర‌బాబు విష‌యంలో బిజెపి సానుకూలంగా ఉండ‌టం వ‌ల్లే తాజా ప‌రిణామాల‌ను కూడా గ‌మ‌నంలోకి తీసుకుని ఆయ‌నకు భ‌ద్ర‌త పెంచింద‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే పూర్తిగా భ‌ద్ర‌తా కోణంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారా లేక ఇందులో రాజ‌కీయ కార‌ణాలు కూడా ఉన్నాయా అన్న‌ది తేలాలంటే కొంత స‌మ‌యం ఆగాల్సిందే.

Next Story
Share it