Telugu Gateway
Politics

ఎవరైనా సుప్రీం తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందే

ఎవరైనా సుప్రీం తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందే
X

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం సందర్భంగా అధికారులతో తనకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపినట్లు వెల్లడించారు. ఎస్ఈసీ ప్రతిష్టను కాపాడాల్సిందిగా గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ..అకస్మాత్తుగా సాయంత్రం నుంచి పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న వారు వ్యక్తిగతంగా, కమిషన్ పైనా, తనపైనా విమర్శలు చేస్తున్నారని..ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించటమే అన్నారు. అవసరం అయితే న్యాయపరంగా ఏమి చేయాలో అది చేస్తామన్నారు. రమేష్ కుమార్ బుధవారం సాయంత్రం మీడియా ముందుకొచ్చి పలు అంశాలపై మాట్లాడారు. ఏకగ్రీవాలు ఇంతకుముందు జరిగాయని, ఇకపై కూడా జరుగుతాయని స్పష్టం చేశారు.

''ఏకగ్రీవాల పట్ల కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆదిత్యానాథ్ దాస్‌తో వ్యక్తిగతంగా నాకు మంచి సంబంధాలున్నాయి. గిరిజాశంకర్, ద్వివేదిలను కేవలం అభిశంసన మాత్రమే చేశా. వారి ప్రతిష్టను ఇనుమడింపజేశా. ఉద్యోగ సంఘాలు నాపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోను. నేను కూడా ఉద్యోగినే. నాకు ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం లేదు. నేను కక్ష సాధింపు చర్యలేమీ చేయలేదు. ప్రభుత్వంపై నా మనసులో ఎలాంటి కక్ష లేదు.ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తోంది. కోడ్ ఆప్ కండక్ట్ విషయంలో ప్రభుత్వం పెద్దలు సంయమనం పాటించాలి.'' అని అన్నారు. ఏకగ్రీవాలకు సంబంధించి పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ కు సంబంధించి సమాచార శాఖ కమిషనర్ ను వివరణ కోరినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని..ఇచ్చినా కూడా విధిగా కమిషన్ అనుమతి తీసుకోవాలన్నారు. ఇది ప్రాథమిక నిబంధన అన్నారు. ఎవరి ప్రాపకం కోసమే తాను పనిచేస్తున్నట్లు ఓ మంత్రి వ్యాఖ్యానించటం ఏ మాత్రం సరికాదన్నారు. రమేష్ కుమార్ తాను చెప్పాలనుకున్న విషయాలు చెప్పి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళారు.

Next Story
Share it