మోడీ ఓ అహంకారి..గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఆయన కేంద్రం తీరుపై పదునైన విమర్శలు చేశారు. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను గవర్నర్ గా ఉండి కూడా ఆయన తప్పుపట్టారు. తాజాగా మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ మన రైతులు 500 మందికిపైగా చనిపోయారని తాను ఆయన్ను కలసినప్పుడు ప్రస్తావిస్తే ...వారు నా కోసం చనిపోయారా అని మోడీ ప్రశ్నించారన్నారు. అందుకు తాను అవునని..పాలకుడు మీరే అయినందున మీ కోసమే వారు చనిపోయినట్లు అవుతుందని వెల్లడించానన్నారు. అదే సమయంలో మోడీ ఓ పెద్ద అహంకారి అంటూ వ్యాఖ్యానించారు. మోడీ చనిపోయిన రైతుల గురించి చేసిన వ్యాఖ్యలతో ఆయనతో వాదనకు తాను ముగింపు పలికానన్నారు.
తనను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలని కోరగా..తాను ఆ పని చేశానని తెలిపారు. దాద్రిలో ఓ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా మాలిక్ ఈ విషయాలు వెల్లడించారు. రైతులకు సంబందించిన పలు అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ)కి చట్టబద్ధత పొందటం వంటి అంశాలు సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉద్యమం చేసిన రైతులపై కేసులు తొలగించటంతోపాటు ఎంఎస్ పీకి చట్టబద్ధత వంటి అంశాలపై ప్రభుత్వం తన నిజాయతీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ సర్కారు నియమించిన గవర్నర్ అయి ఉండి కూడా సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొంత కాలంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు.