Telugu Gateway
Politics

ఇప్పుడు ఆ ప్రకటన వెనక ఎజెండా ఏంటి?

ఇప్పుడు ఆ ప్రకటన వెనక ఎజెండా ఏంటి?
X

ప్రధాని మోడీ..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లకు రాజ్యాంగ హత్యా దినోత్సవం జరపాలి అనే విషయం ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది?. దీని వెనక ఎజెండా ఏంటి?. పదేళ్ల పాలన తర్వాత...మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఇక నుంచి ప్రతి ఏటా జూన్ 25 ను రాజ్యాంగ హత్యా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయిస్తూ కేంద్రంగా ఏకంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు కావస్తున్నా వేళ నిర్వహించుకోవడానికి ఇది ఏమీ ఉత్సవం కాదు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ అనేది దేశంలో చీకటి అధ్యాయమే. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లు పాటు ఎప్పుడూ గుర్తుకు రాని రాజ్యాంగ హత్యా దినోత్సవం అకస్మాత్తుగా ఇప్పుడే ఎందుకు తెరమీదకు వచ్చింది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయించక మానదు. అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం తప్ప ఇందులో ఎలాంటి హేతుబద్దత కనిపించటం లేదు అనే చెప్పొచ్చు. నిజంగా ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ విషయంలో అటు మోడీ కి కానీ...ఇటు అమిత్ షా కు కానీ...ప్రతి ఏటా ఈ చీకటి అధ్యాయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు చేసిన పనిని చేసి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఎందుకంటే గత పదేళ్లుగా దేశంలో మోడీ ఏది చెపితే అదే నడిచింది. బీజేపీ పూర్తి మెజారిటీతో ఏకఛత్రాధిపత్యం చలాయించింది. అందుకే అప్పుడు ఆ అవసరం రాలేదు.

కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీ కి షాక్ తగిలింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావాల్సిన మెజారిటీ కూడా దక్కలేదు. దీంతో ఎన్ డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరో వైపు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గత కొంత కాలంగా పదే పదే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు కూడా రాజ్యాంగమే ప్రధాన ఎన్నికల ప్రచార అంశంగా మారిన విషయం తెలిసిందే. మోడీ మళ్ళీ ఆయన కోరుకున్నట్లు నాలుగు వందల సీట్ల తో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దేశంలో మళ్ళీ ఎన్నికలు కూడా ఉండవు అంటూ విపక్షాలు ప్రచారం చేసుకుంటూ వచ్చాయి. ఈ ప్రచారం కొంత పనిచేసినట్లు కూడా ఫలితాలు స్పష్టం చేశాయి. గత పదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు లోక్ సభ లో ప్రతిపక్షం అత్యంత బలంగా ఉంది. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన సమయం లో రాహుల్ గాంధీ తో పాటు చాలా మంది విపక్ష ఎంపీలు కూడా రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకున్న విషయం తెలిసిందే. అత్యంత కీలక బిల్స్ విషయంలో కూడా మోడీ సర్కారు గత పదేళ్ల కాలంలో విపక్షాలను బుల్డోజ్ చేసుకుంటూ ఉభయ సభల్లో ఆమోదింప చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. మరీ ముఖ్యంగా గత టర్మ్ లో అయితే దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో లోక్ సభ సభ్యులను పెద్ద ఎత్తున సస్పెండ్ చేసి మరీ బిల్స్ మమ అనిపించుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అత్యంత శక్తివంతంగా ఉండటం...మరో వైపు మిత్రపక్షాల మద్దతుపై బీజేపీ ఆధారపడి ఉండటంతో ఏకపక్ష నిర్ణయాలకు ఛాన్స్ ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం పని వ్యాపారం చేయటం కాదు...కీలక రంగాలు తప్ప అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించటమే తమ విధానం అని చెప్పుకున్న మోడీ సర్కారు ఇప్పడు లైన్ మార్చినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం కావటమే. ఎక్కడి వరకో ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి అత్యంత కీలకమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ సర్కార్ వైఖరి మారినట్లు కేంద్ర భారీ ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామి మాటలను బట్టి స్పష్టం అవుతోంది. ఇది ఇలా ఉంటే బీజేపీ ఎమర్జెన్సీ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ గత పదేళ్లుగా దేశంలో సాగుతున్నది అప్రకటిత ఎమర్జెన్సీనే అంటూ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అసలు ఎలాంటి చర్చా లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సడన్ గా రాజ్యాంగ హత్యా దినోత్సవం అంటూ ప్రకటన చేయటంతో ఆ పార్టీ ఎంత టెన్షన్ లో ఉందో అన్న చర్ఛ కూడా తెరమీదకు వస్తోంది. పవిత్రమైన రాజ్యాంగాన్ని హత్య అనే పాదంతో ముడిపెట్టి బీజేపీ అంబేద్కర్ ను బీజేపీ అవమానిస్తోంది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు.

Next Story
Share it