కెసీఆర్ వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్
కృష్ణా జలాల విషయంలో ఏపీ సర్కారు దాదాగిరి చేస్తుందన్న ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. ''కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో జల వివాదానికి దిగారు. ఆంధ్రా వాటా నీటిని కాపాడుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు.'' అని తెలిపారు.
సోమవారం నాడు నాగార్జునసాగర్ లో పర్యటించిన కెసీఆర్ కృష్ణాపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న సజ్జల ఈ అంశంపై స్పందించారు. వరదల సమయంలో ఎక్కువ నీటిని తీసుకునేందుకు సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఎవరు చెప్పినా పట్టించుకోకపోవటమే దాదాగిరి అన్నారు. ఏపీ చేసేది తమను తాము కాపాడుకునే పనే తప్ప మరొకటి కాదన్నారు.