రఘురామపై వేటు వేయండి
వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్ కు సంబంధించి స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా శుక్రవారం నాడు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు.
గత కొంత కాలంగా ఏపీలో రఘురామక్రిష్ణంరాజు వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబందించి ఆయనపై దేశద్రోహం కేసు నమోదు కావటం..అరెస్ట్ చేయటం..అనంతరం ఆయన తనపై సీఐడీ అధికారులు దాడి చేశారని చెప్పటంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు తనపై జరిగిన దాడి గురించి ఆయన ఢిల్లీ వేదికగా అందరికీ లేఖలు రాస్తూ ఈ విషయం లైవ్ లో ఉండేలా చూస్తున్నారు. ఈ దశలో మరోసారి వైసీపీపై ఆయన వేటుకు పిర్యాదు చేసింది.