Telugu Gateway
Politics

ఐసీయూలో రూపాయి..కాంగ్రెస్ మండిపాటు

ఐసీయూలో రూపాయి..కాంగ్రెస్ మండిపాటు
X

ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గ‌తంలో అచ్చం ఇలాంటి విమ‌ర్శ‌లే చేశారు. యూపీఏ హ‌యాంలో రూపాయి ప‌త‌నంపై అప్ప‌ట‌ట్లో స్పందించిన మోడీ ఓ ఆర్ధిక వేత్త ప్ర‌ధానిగా ఉన్నా కూడా రూపాయి మాత్రం బ‌క్క‌చిక్కిపోతుంద‌ని...ఐసీయూలో ఉంద‌ని ఎద్దేవా చేశారు. మ‌న్మోహ‌న్ సింగ్ ను ఉద్దేశించి ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు. సీన్ క‌ట్ చేస్తే మోడీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత గ‌తంలో ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పెట్రో ధ‌ర‌ల ద‌గ్గ‌ర నుంచి మొద‌లుపెడితే సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న చెప్పిన వాటికి ..ఇప్పుడు అమ‌లు చేస్తున్న వాటికి పూర్తి భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్నాయి. అంత‌ర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధ‌ర‌లు త‌గ్గిన స‌మ‌యంలో కూడా ఆయ‌న ఆ ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు బ‌ద‌లాయించ‌కుండా..ప‌న్నుల రూపంలో స‌ర్కారు ఖ‌జానా నింపుకునేందుకు ప‌ని చేశారు.

ఇప్పుడు ఆర్ధిక వ్య‌వస్థ తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉండ‌టంతోపాటు..కేంద్రం చేసే అప్పులు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ద్ర‌వ్యోల్భ‌ణం గ‌ణ‌నీయంగా పెర‌గ‌టంతో ఆర్ బిఐ తాజాగా దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టి...రెపో రేటు తోపాటు సీఆర్ఆర్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. త‌రుగుతున్న విదేశీ నిల్వ‌లు..పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా రూపాయి చ‌రిత్ర‌లో ఎన్న‌డూలేని రీతిలో డాల‌ర్ తో పోలిస్తే 77.42 రూపాయ‌ల‌కు పత‌నం అయింద‌ని కాంగ్రెస్ నేత ర‌ణ‌దీప్ సూర్జేవాలా విమ‌ర్శించారు. బిజెపి ప్రాయోజిత మ‌త ఉద్రిక్త‌త‌లు కూడా ఈ ప‌త‌నానికి కార‌ణం అని పేర్కొన్నారు. గ‌తంలో మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌నే ఇప్పుడు కాంగ్రెస్ రిట‌ర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన‌ట్లు ఉంద‌నే వ్యాఖ్య‌లు విన్పిస్తున్నాయి.

Next Story
Share it